
China: ఆ విధానం వదిలేస్తే.. చైనాలో భారీగా కొవిడ్ కేసులు
తాజా అధ్యయనం వెల్లడి
బీజింగ్: మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా అవలంబిస్తున్న ‘జీరో కొవిడ్ టోలరెన్స్’ విధానాన్ని వదిలేస్తే.. ఒక్కసారిగా అతి భారీ స్థాయిలో కేసులు విజృంభిస్తాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ విధానాన్ని ఎత్తివేయడంతో పాటు, పలు దేశాల మాదిరిగా ప్రయాణాలపై నిషేధాన్ని కూడా తొలగిస్తే చైనాలో రోజుకు 6.30 లక్షల వరకు కొవిడ్ కేసులు బయటపడే ప్రమాదం ఉందని ఇక్కడి పెకింగ్ యూనివర్సిటీకి చెందిన గణితశాస్త్ర నిపుణులు ఓ నివేదికలో పేర్కొన్నారు.
2019 ఆఖరులో కరోనా తొలి కేసు చైనాలోని వూహాన్‌లోనే బయటపడిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారిగా మారినప్పటి నుంచి చైనా ‘ఒక్క కేసు కూడా రాకూడదన్న’ లక్ష్యంతో కట్టుదిట్టమైన విధానాన్ని అవలంబించింది. చైనాకు ఈ ‘జీరో కొవిడ్’ విధానం తప్ప మరో మార్గం లేదని స్థానిక మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా దీన్ని వదిలేసి, అమెరికా ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాన్ని పాటిస్తే రోజుకు 6,37,155 కేసులు బయపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది.