
బైడెన్ బృందంలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
మలేరియా కార్యక్రమ సమన్వయకర్తగా రాజ్ పంజాబీ నియామకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాలనా బృందంలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి లభించింది. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో మలేరియా కట్టడికి చేపట్టిన కార్యక్రమానికి సమన్వయకర్తగా రాజ్ పంజాబీ నియమితులయ్యారు. ఈ పదవికి తనను ఎంపిక చేసిన అధ్యక్షుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
రాజ్.. లైబీరియాలో జన్మించారు. 1990లలో అక్కడ అంతర్యుద్ధం చెలరేగడంతో ఆయన కుటుంబం ప్రాణాలు అరచేతపట్టుకొని అమెరికాకు వలస వచ్చారు. అప్పుడు ఆయన వయసు 9 ఏళ్లు. ‘‘ఆ సమయంలో అమెరికన్లు నా కుటుంబానికి తోడుగా నిలిచారు. మా జీవితాలు తిరిగి గాడిన పడేందుకు సాయం అందించారు. అలాంటి దేశానికి సేవలు అందించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం’’ అని రాజ్ చెప్పారు. 2007లో ఆయన తిరిగి వైద్య విద్యార్థిగా లైబీరియాలో అడుగుపెట్టారు. అమెరికాలో వైద్యుడిగా, ప్రజారోగ్య నిపుణుడిగా ఆయన విశేష సేవలు అందించారు. లాస్ట్ మైల్ హెల్త్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. మలేరియాతో చాలా ప్రాణాలు పోవడాన్ని ఆఫ్రికాలో వైద్యుడిగా పనిచేస్తున్నప్పుడు గమనించానన్నారు. అందువల్ల ఈ పదవి తనకు వ్యక్తిగతంగా కూడా చాలా ముఖ్యమైందని తెలిపారు. మలేరియా సమన్వయకర్తగా నియమితులైన రాజ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనమ్ అభినందించారు.
ఇవీ చదవండి..