ఆ ఏడు కార్లలోనే వాజే కేసు గుట్టు!

పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కారు కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది.

Updated : 02 Apr 2021 09:57 IST

హోటల్‌లో, ఠాణెలోని అపార్ట్‌మెంట్‌లో కూడా
దొంగ సిమ్‌లు పొందేందుకు ఉపయోగించిన పత్రాలు స్వాధీనం!

ముంబయి: పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కారు కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ పేలుడు పదార్థాలు ఉంచిన వాహనం యజమాని మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతికి సంబంధించిన వివరాలను వెలికితీస్తోంది. ఇందులో భాగంగా గురువారం దక్షిణ ముంబయిలో ఓ హోటల్‌, క్లబ్‌లో సోదాలు నిర్వహించింది. పొరుగునే ఉన్న ఠాణె జిల్లాలోని ఓ అపార్ట్‌మెంట్‌లోనూ అధికారులు తనిఖీలు చేశారు. ఈ మేరకు దక్షిణ ముంబయిలో హోటల్‌, క్లబ్‌ ఉన్న సోని భవంతి వద్దకు మధ్యాహ్నం 12.45 గంటలకు ఎన్‌ఐఏ బృందం చేరుకుంది. బాబుల్‌నాథ్‌ ఆలయం సమీపంలో ఉన్న భవనంలో ఖాతాదారులు, సిబ్బందిని బయటకు పంపించిన అనంతరం ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా క్లబ్‌లో, హోట్‌ల్‌లోని కొంత మందిని ప్రశ్నించారు. సచిన్‌ వాజే ఉపయోగించిన దొంగ సిమ్‌ కార్డులను పొందేందుకు సమర్పించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ మేరకు ‘ఆశిశ్‌ క్లబ్‌’లో సోదాలు నిర్వహించారు. దేవజిత్‌ అనే వ్యక్తి దీనిని నిర్వహిస్తున్నారు. ఈయన వాజే సూచనల మేరకు నరేశ్‌ గోర్‌ అనే వ్యక్తిని పనిలో పెట్టుకున్నారు. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం సిమ్‌ కార్డులను కొనాల్సిందిగా నరేశ్‌ను వాజే ఆదేశించారు. అనంతరం నరేశ్‌ పొరుగు రాష్ట్రం గుజరాత్‌లో సిమ్‌ కార్డులను కొనుగోలుచేసి.. వాటిని కేసులో సహ నిందితుడైన వినాయక్‌ శిందే ద్వారా వాజేకు చేరవేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలా సేకరించిన సిమ్‌ కార్డుల్లోని ఒకదాని నుంచి హిరేన్‌కు వాజే ఫోన్‌చేశారు. మరణించడానికి ముందు హిరేన్‌ మాట్లాడిన చివరి కాల్‌ అదే కావడం గమనార్హం. సిమ్‌లకు సంబంధించిన పత్రాలతోపాటు ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చినట్లు వెల్లడించే కొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ముంబయిలోని క్లబ్‌, హోటల్‌లో సుమారు మూడు గంటలపాటు సోదాలు కొనసాగాయి. ఎన్‌ఐఏకే చెందిన మరో బృందం ఠాణె జిల్లాలోని మిరా రోడ్డు ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేసింది. ఓ మహిళ ఆధీనంలో ఉన్న ఈ ఇంటికి రెండు వారాలుగా తాళం వేసి ఉంది.
ఆ ఏడు కార్లలోనే వాజే కేసు గుట్టు!
పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు, మన్‌సుఖ్‌ హిరేన్‌ మృతి కేసుల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు కార్ల చుట్టూ తిరుగుతోంది. ముంబయిలోని అంబానీ నివాసం వద్ద కలకలం రేపిన స్కార్పియోతో మొదలు ఇటీవల స్వాధీనం చేసుకున్న ఔట్‌ల్యాండర్‌ వరకు ఈ కేసులో ఇప్పటివరకు జాతీయ దర్యాప్తు సంస్థ 7 కార్లు స్వాధీనం చేసుకుంది. వీటిలో కొన్ని వాహనాలకు ముంబయి నగర పోలీస్‌ కమిషనరేట్‌తో సంబంధం ఉన్నట్లు తేలగా... మున్ముందు ఈ దర్యాప్తు ఎలా సాగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో ఇటీవల సీజ్‌ చేసిన ఔట్‌ల్యాండర్‌ కారుకు సంబంధించి ప్రకాశ్‌ హోవల్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఎన్‌ఐఏ విచారిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని