Music: నచ్చిన సంగీతం వినండి.. మెదడును హాయిగా ఉంచుకోండి

సంగీతం మెదడును చైతన్యవంతం చేస్తుందా, చురుగ్గా పని చేయిస్తుందా? నచ్చిన పాట వింటే మెదడు ఉత్తేజితం అవుతుందా? అల్జీమర్స్‌తో బాధపడుతున్నవారు కూడా సంగీతానికి స్పందిస్తారా?

Published : 22 Nov 2021 08:14 IST

‘బ్రైటన్‌’ పరిశోధకుల అధ్యయనం

బ్రైటన్‌ (యూకే): సంగీతం మెదడును చైతన్యవంతం చేస్తుందా, చురుగ్గా పని చేయిస్తుందా? నచ్చిన పాట వింటే మెదడు ఉత్తేజితం అవుతుందా? అల్జీమర్స్‌తో బాధపడుతున్నవారు కూడా సంగీతానికి స్పందిస్తారా? అవుననే అంటున్నారు బ్రైటన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు. స్ట్రోక్‌, అల్జీమర్స్‌, మెదడు గాయాల చికిత్సలో సంగీతం కీలక పాత్ర పోషిస్తోందని వీరు చెబుతున్నారు. ఇందుకోసం ‘న్యూరోలాజిక్‌ మ్యూజిక్‌ థెరపీ’ అనే చికిత్సా విధానాన్ని ముందుకు తెస్తున్నారు.

పరిశోధనలో కీలకాంశాలు
* మానవుడి మెదడుపై సంగీతం చూపే ప్రభావం అపారం. మెదడులో మాటలు, కదలిక, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రించే భాగాలను సంగీతం ఉత్తేజితం చేస్తుంది. భౌతికంగా బ్రెయిన్‌ మ్యాటర్‌నూ పెంచుతుంది. మెదడు తనంతట తాను మరమ్మతు చేసుకునేందుకూ సంగీతం సాయపడుతుంది.

* అల్జీమర్స్‌ ఉన్నవారిని కూడా పాటలు ప్రతిస్పందించేలా చేస్తాయి. గత జ్ఞాపకాలను తిరిగి పొందడానికీ సాయపడతాయి. మెదడు దెబ్బతినడం వలన మాటలు కోల్పోయిన వారిలోనూ బ్రైటన్‌ పరిశోధకుల ‘న్యూరోలాజిక్‌ మ్యూజిక్‌ థెరపీ’ సానుకూల ఫలితాలనే సాధించింది.

* మెదడుపై సంగీతం చూపించే శక్తిమంతమైన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని స్ట్రోక్‌, పార్కిన్సన్స్‌, మెదడు గాయాల చికిత్సకు న్యూరోలాజిక్‌ మ్యూజిక్‌ థెరపీని రంగంలోకి తెచ్చారు. ఫిజియోథెరపీ, స్పీచ్‌ థెరపీలానే ఇది పనిచేస్తుంది. రోగులు తమ లక్షణాలను సమర్థవంతంగా ఎదుర్కొవడంలోనూ, దైనందిన జీవితంలో కార్యకలాపాలను వారు మెరుగ్గా నిర్వహించుకోవడంలోనూ ఈ థెరపీ సాయపడుతుంది. మిగతా థెరపీలతో పోలిస్తే ఇది మెరుగ్గా పనిచేస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని