Afghanistan: మహిళలకు బలవంతపు పెళ్లిళ్లపై తాలిబన్‌ నిషేధం

మహిళలపై తీవ్ర వివక్ష చూపే తాలిబన్లు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతపు పెళ్ళిళ్లు నిషేధించారు. పురుషులు, మహిళలు...

Published : 04 Dec 2021 08:18 IST

ఇస్లామాబాద్‌: మహిళలపై తీవ్ర వివక్ష చూపే తాలిబన్లు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహానికి స్త్రీ అనుమతి తప్పనిసరి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతపు పెళ్ళిళ్లు నిషేధించారు. పురుషులు, మహిళలు సమానమని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.. స్త్రీలను ఆస్తిగా పరిగణించకూడదంటూ కూడా పేర్కొన్నారు. తాలిబన్‌ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. మహిళలపై తీవ్రమైన వేధింపులు, అణచివేతకు పాల్పడిన చరిత్ర తాలిబన్లకు ఉంది. ఇటీవల అఫ్గాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత కూడా వారి వైఖరిలో మార్పు లేదు. అయితే ఒకవైపు అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతోనే మహిళల విషయంలో తాలిబన్‌ ఉదార వైఖరి ప్రదర్శించిందని విశ్లేషకులు అంటున్నారు. అయితే తాజా ఉత్తర్వుల్లో కనీస వివాహ వయసును పేర్కొనలేదు. గతంలో ఇది 16 ఏళ్లుగా ఉండేది. పేదరికం, పిడి సంప్రదాయవాదం వేళ్లూనుకున్న ఆఫ్గాన్‌లో బలవంతపు పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారాయి. ఆడపిల్లల్ని అమ్ముకోవడం, అప్పు కింద చెల్లించడం, సంధి కోసం పణంగా పెట్టడం వంటివి సంప్రదాయంగా చలామణి అవుతున్నాయి. గిరిజన తెగల్లో వితంతువులైన మహిళలు.. భర్త అన్నదమ్ముల్లోనే ఒకరిని తిరిగి వివాహం చేసుకోవాలన్న నియమం ఉంది. ఇలాంటి ఆచారాలన్నింటినీ మార్చేలా తాలిబన్ల తాజా ఉత్తర్వులున్నాయి. అలాగే భర్తను కోల్పోయిన మహిళ.. 17 వారాల తర్వాత తన ఇష్టప్రకారం నచ్చిన వ్యక్తిని భర్తగా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని