మేం విచారించే వరకు ఆగండి

జ్ఞానవాపి మసీదు సర్వే వ్యవహారంపై శుక్రవారం తాము విచారణ చేపట్టే వరకు వారణాసి సివిల్‌ కోర్టు తమ విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. వీడియోగ్రఫీ సర్వేను

Published : 20 May 2022 05:36 IST

జ్ఞానవాపి మసీదు అంశంపై వారణాసి కోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు

దిల్లీ: జ్ఞానవాపి మసీదు సర్వే వ్యవహారంపై శుక్రవారం తాము విచారణ చేపట్టే వరకు వారణాసి సివిల్‌ కోర్టు తమ విచారణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. వీడియోగ్రఫీ సర్వేను వ్యతిరేకిస్తూ అంజుమన్‌ ఇంతెజామియా మసీదు నిర్వహణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం (జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.  తమ సీనియర్‌ న్యాయవాది అనారోగ్యంతో ఉన్నారని, విచారణను శుక్రవారానికి లేదా మరో రోజుకు వాయిదా వేయాలని హిందువుల తరఫున న్యాయవాదులు విచారణ సందర్భంగా కోరారు. అదే సమయంలో మసీదు కమిటీ తరఫు న్యాయవాది హుజేఫా అహ్మదీ... దేశంలోని పలు మసీదులను సీల్‌ చేయాలని వివిధ కోర్టులకు దరఖాస్తులు అందాయని, జ్ఞానవాపి మసీదులో కొలను చుట్టూ ఉన్న గోడను కూల్చివేయాలన్న పిటిషన్‌పై కూడా వారణాసి కోర్టులో విచారణ జరుగుతోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధర్మాసనం విచారణ చేపట్టేవరకు ట్రయల్‌ కోర్టు తదుపరి ప్రక్రియ నిర్వహించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. దీనికి హిందువుల తరఫున న్యాయవాదులు కూడా అంగీకరించారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో గురువారం వారణాసి కోర్టు కూడా... విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. మరోవైపు వారణాసి కోర్టు నియమించిన జ్ఞానవాపి మసీదు సర్వే కమిటీ గురువారం రెండో నివేదికను సమర్పించింది. డాక్యుమెంట్లు, వీడియోలు, ఫొటోలు న్యాయస్థానం ముందు ఉంచింది. 


మథుర ‘శ్రీకృష్ణ జన్మభూమి’పైనా విచారణ

 షాహీ ఈద్గా మసీదు తొలగింపు  పిటిషన్‌కు న్యాయస్థానం అనుమతి

మథుర: ఓ వైపు కాశీలోని జ్ఞానవాపి మసీదుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్న సమయంలోనే, మథుర శ్రీకృష్ణ జన్మభూమి అంశంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం కట్రా కేశవ్‌ దేవ్‌ మందిరం ప్రాంగణంలోని షాహీ ఈద్గా మసీదును తొలగించాలంటూ వేసిన రివిజన్‌ పిటిషన్‌కు మథుర జిల్లా కోర్టు అనుమతి మంజూరు చేసింది. దీంతో ఇంతకుముందు ఈ దావాను కొట్టేసిన దిగువ కోర్టు.. దీనిపై విచారణ చేయనుంది. ఈ వ్యాజ్యాన్ని తొలుత 2020 సెప్టెంబర్‌ 25న శ్రీకృష్ణ విరాజ్‌మాన్‌ తరఫున లఖ్‌నవూ నివాసి రంజనా అగ్నిహోత్రి, మరో ఆరుగురు దిగువ కోర్టులో దాఖలు చేశారు. అందులో శ్రీకృష్ణజన్మభూమి ట్రస్ట్‌కు చెందిన 13.37 ఎకరాల స్థలంలోని కొంత భాగంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించారని పేర్కొన్నారు. అందులో మసీదును తొలగించి ఆ స్థలాన్ని తిరిగి ట్రస్టుకు అప్పగించాలని కోరారు. అయితే ఈ వ్యాజ్యాన్ని సీనియర్‌ సివిల్‌ జడ్జి తిరస్కరించారు. దీంతో పిటిషనర్లు.. జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం వాదనలు విన్న జిల్లా, సెషన్స్‌ జడ్జి రాజీవ్‌ భారతి పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని