తప్పిపోయిన వ్యక్తిని కొట్టి చంపారు!

మానసిక స్థిరత్వంలేని వ్యక్తి తప్పిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకు అతని మృత దేహం లభించింది. అంత్యక్రియలు జరిపించిన తర్వాత అతనిది సహజ మరణం

Published : 22 May 2022 05:47 IST

పేరు, ఆధార్‌ కార్డు వివరాలు అడుగుతూ దాడి
మానసిక స్థిరత్వంలేని వ్యక్తిపై మధ్యప్రదేశ్‌లో దారుణం

నీముచ్‌: మానసిక స్థిరత్వంలేని వ్యక్తి తప్పిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన కొద్ది రోజులకు అతని మృత దేహం లభించింది. అంత్యక్రియలు జరిపించిన తర్వాత అతనిది సహజ మరణం కాదని, దాడికి గురవడం వల్లే మృతి చెందాడని తెలుసుకుని అవాక్కయ్యారు! ఈ ఘోరాన్ని ఓ వీడియో దృశ్యం వెలుగులోకి తీసుకురాగా నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌ జిల్లా సర్సీ గ్రామానికి చెందిన భవర్‌లాల్‌ జైన్‌ ఈ నెల 15 నుంచి కనిపించడంలేదు. అంతకు ముందు అతను రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. శుక్రవారం ఉదయం అతని మృతదేహం నీముచ్‌ జిల్లా ప్రధాన కేంద్రానికి 38 కి.మీ.దూరంలో ఉన్న రాంపుర రోడ్డు వద్ద లభించగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపించారు. ఆ తర్వాత భవర్‌లాల్‌ జైన్‌ను తీవ్రంగా కొడుతున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియో వారి దృష్టికి వచ్చింది. దీంతో మాన్సా పోలీసులకు ఫిర్యాదు చేయగా వీడియోలో దాడి చేస్తున్నట్లున్న వ్యక్తిపై, ఆ దృశ్యాలను చిత్రీకరించిన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ప్రాథమిక విచారణలో... దాడి చేసిన వ్యక్తి మాన్సా నివాసి దినేశ్‌ కుష్వాహాగా గుర్తించి, శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పేరు వెల్లడించాలని బెదిరించడంతో పాటు ఆధార్‌కార్డు చూపాలంటూ బాధితుడిని తీవ్రంగా హింసిస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. భవర్‌లాల్‌ జైన్‌పై భౌతిక దాడికి దిగిన దినేశ్‌ కుష్వాహా స్థానిక భాజపా నాయకుడని కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని