ఒక్క ఫోన్‌కాల్‌..12 ప్రాణాలు

ఒక్క ఫోన్‌ కాల్‌ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీని తెలిపింది. వారి ప్రాణాలను నిలబెట్టింది. ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జలవిద్యుత్కేంద్రంలో పనిచేస్తున్న అనేక మంది కార్మికులు గల్లంతయ్యారు.

Published : 08 Feb 2021 17:36 IST

సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించిన ఐటీబీపీ సిబ్బంది

దేహ్రాదూన్: ఒక్క ఫోన్‌ కాల్‌ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీని తెలిపింది. వారి ప్రాణాలను నిలబెట్టింది. ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జలవిద్యుత్కేంద్రంలో పనిచేస్తున్న అనేక మంది కార్మికులు గల్లంతయ్యారు. మరి కొందరు సొరంగాల్లో చిక్కుకుపోయారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం 12 మంది కార్మికులు చమోలీలోని తపోవన్‌ సొరంగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒక కార్మికుడి ఫోన్‌కు సిగ్నల్‌ లభించడంతో మేనేజర్‌కు సమాచారమిచ్చారు. ఆయన స్థానిక అధికారులను సంప్రదించగా ఐటీబీపీ (ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులు) సహాయక చర్యలు ప్రారంభించి వారిని రక్షించారు.

ఆ ఫోన్‌కాలే కాపాడింది: కార్మికులు
‘‘ మేం సొరంగం లోపల పనులు చేస్తుండగా బయటి నుంచి కొందరి అరుపులు వినిపించాయి. ‘బయటకి వచ్చేయండి అంటూ’.. కానీ మేం స్పందించేలోపు అకస్మాత్తుగా నీరు, బురద మమ్మల్ని నెట్టేశాయి. మేం 300 మీటర్ల లోతులో ఉన్నాం. ఒక్కసారిగా నీరు రావడంతో ఏం చేయాలో తెలియక సొరంగం పైకి వెళ్లేందుకు ప్రయత్నించాం.’’ అని సొరంగంలో పనిచేస్తున్న లాల్‌బహదూర్‌, బసంత్‌ తెలిపారు. ‘‘ మా ప్రాణాలపై మేం ఆశలు వదిలేసుకున్నాం. అప్పుడు ఒక వైపు నుంచి గాలి, వెలుతురు రావడం గమనించాం. అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నాం. అప్పుడు మాలో ఒకరి ఫోన్‌లో నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చింది. ఆలస్యం చేయకుండా మా మేనేజర్‌కు ఫోన్‌ చేసి మా పరిస్థితిని వివరించాం.’’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కార్మికుడు తెలిపారు.

ప్రాజెక్ట్‌ జనరల్‌ మేనేజర్‌ వెంటనే పోలీసులను సంప్రదించడంతో ఐటీబీపీ దళాలు సహాయక చర్యలు ప్రారంభించారని అధికారులు తెలిపారు. సుమారు 7 గంటల పాటు కార్మికులు సొరంగంలో చిక్కుకున్నట్లు వారు వెల్లడించారు. సన్నటి సొరంగాన్ని ఏర్పాటు చేసి దాన్నుంచి వీరిని రక్షించారు. రక్షించిన 12 మంది కార్మికులను ఘటనా స్థలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీబీపీ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఒక్క సొరంగమే కాకుండా ఇతర ప్రాంతాల్లోని సొరంగాల్లో మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. సొరంగాల్లో ఉన్న వారిని ముందుగా రక్షించేందుకు సిద్ధమైనట్లు వారు తెలిపారు. ఈ వరదలతో అనేక ప్రాంతాల్లోని వంతెనలు ధ్వంసమైయ్యాయి. దీంతో రవాణా సదుపాయం లేని 13 గ్రామాల్లోని ప్రజలకు హెలికాఫ్టర్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో ఇప్పటి వరకూ 14 మృతదేహాలను వెలికి తీయగా.. మరో 170 మందికి పైగా కార్మికుల ఆచూకీ తెలియరాలేదు.

ఇవీ చదవండి..

ఉత్తరాఖండ్‌ విలయం:203 మంది గల్లంతు

తుడిచిపెట్టుకు పోయిన విద్యుత్కేంద్రాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని