
global warming: 24,000 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వేడెక్కిన పుడమి
వాషింగ్టన్: మానవ చర్యల కారణంగా గత 150 ఏళ్లలో భూతాపం బాగా పెరిగిపోయిందని తాజా అధ్యయనం పేర్కొంది. 24,000 సంవత్సరాల కిందట చివరి మంచు యుగం ముగిశాక ఎన్నడూ ఇంత వేగంగా పుడమి వేడెక్కలేదని వివరించింది. అమెరికాలోని ఆరిజోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వాతావరణ మార్పులకు కారణమయ్యే ప్రధాన అంశాలను వీరు పరిశోధన చేశారు. చివరి మంచు యుగం తర్వాత భూతాపానికి ప్రధాన కారణం.. గ్రీన్‌హౌస్ ఉద్గారాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం, మంచు ఫలకాలు తరిగిపోవడమేనని వారు తెలిపారు. గత 10వేల సంవత్సరాల్లో సాధారణంగానే పుడమి వేడెక్కుతోందని చెప్పారు. గత 150 ఏళ్లలో వేడెక్కే ప్రక్రియ చాలా ఎక్కువగా ఉందన్నారు. 200 ఏళ్లకోసారి చొప్పున మ్యాప్‌లను తయారుచేశారు. సముద్రాల్లోని అవక్షేపాల్లో పురాతన ఉష్ణోగ్రతలకు సంబంధించిన ఆనవాళ్లను పరిశీలించారు. వాటిని వాతావరణానికి సంబంధించిన కంప్యూటర్ సిమ్యులేషన్లను జోడించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.