Updated : 01/10/2021 12:13 IST

Ordnance Factory Board: 220 ఏళ్ల ప్రస్థానానికి నేటితో ముగింపు..!

* ఏడు పీఎస్‌యూలుగా ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

భారత్‌లోనే అత్యంత పురాతన కర్మాగారాల్లో ఒకటి నేటి నుంచి తన రూపు రేఖలు మార్చుకొని కార్పొరేట్‌ లుక్‌ను సంతరించుకొంది. రక్షణ రంగంలో మేకిన్‌ ఇండియా లక్ష్యసాధనకు, ప్రభుత్వ రంగాల్లోని ఉత్పత్తి సంస్థల్లో  జాప్యాన్ని నివారించడానికి, నాణ్యతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకొన్నారు. భారత రక్షణ రంగంలో జరిగిన అతికీలక మార్పుల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోనుంది.

ఏమిటీ ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌..

భారత రక్షణ రంగంలో అత్యంత పురాతన, అతిపెద్ద సంస్థ ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్ (ఆయుధ కర్మాగార మండలి)‌. 1712లో డచ్‌కు చెందిన ఓస్టెండ్‌ కంపెనీ తొలిసారి ఇషాపూర్‌లో గన్‌పౌడర్‌ కర్మాగారం ఏర్పాటు చేసింది. 1987లో బ్రిటిష్‌ వారు అక్కడే మరో కర్మాగారం ఏర్పాటు చేశారు. 1791లో ఇది ఉత్పత్తిని ప్రారంభించింది. 1801లో కోల్‌కత్తాలోని కోసీపోర్‌లో గన్‌క్యారేజీ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పటికీ ఉంది.

ఇలా మెల్లగా విస్తరిస్తూ ప్రస్తుతం భారత్‌లో 41 ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు అయ్యాయి. దీంతోపాటు తొమ్మిది శిక్షణ సంస్థలు, మూడు రీజనల్‌ మార్కెటింగ్‌  సెంటర్లు, ఐదు రీజనల్‌ కంట్రోలర్స్‌ ఆఫ్‌ సేఫ్టీలు ఉన్నాయి. దీనిలో మొత్తం 70వేల మందికిపైగా పనిచేస్తున్నారు. ఈ సంస్థల వార్షిక టర్నోవర్‌ రూ.19వేల కోట్లు. ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ కింద పనిచేసింది.

కార్పొరేటీకరణ ఎందుకు..?

రక్షణ రంగంలో సంస్కరణలపై 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వం నాలుగు కమిటీలను నియమించింది. వీటిల్లో మూడు కమీటీలు ఓఎఫ్‌బీ ప్రైవేటీకరణకు ఓటువేశాయి. ఒక కమిటీ వ్యతిరేకించింది. టీకేఎస్‌ నాయర్‌ కమిటీ (2000), విజయ్‌ కేల్కర్‌ కమిటీ (2005), వైస్‌ అడ్మిరల్‌ రామన్‌ పూరి కమిటీ (2015)లు కార్పొరేటీకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. కానీ, లెఫ్టినెంట్‌ జనరల్‌ డీబీ షెటక్కర్‌ కమిటీ మాత్రం వ్యతిరేకించింది. అన్ని ఫ్యాక్టరీలకు  తరచూ ఆడిటింగ్లు నిర్వహించి మెరుగు పర్చవచ్చని సూచించింది. దీంతో ప్రభుత్వం కార్పొరేటీకరణ వైపు మొగ్గింది.

విమర్శల సునామీ..

భారత్‌లోని భద్రతా దళాలు వాడే అత్యధిక శాతం ఆయుధాలు ఓఎఫ్‌బీ నుంచే తయారై వస్తాయి. ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ బోర్డ్‌ పనితీరుపై విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభుత్వ రక్షణ విభాగంలో ఒకటిగా పనిచేసి.. దళాలకు సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. దీనికి నేరుగా దళాలు ఆయుధ, మందుగుండు ఆర్డర్లను ఇస్తాయి. సరఫరాపై షరతులతో కూడిన ఒప్పందాలు ఏమీ ఉండవు. దీంతో సరఫరాలో భారీగా జాప్యం జరుగుతోంది. నాణ్యత కూడా అత్యంత నాసిగా ఉంటోందని దళాలు గగ్గోలు పెడుతున్నాయి. భారత సైన్యం 2019లో 114 ధనుష్‌ శతఘ్నులకు ఆర్డర్‌ ఇచ్చింది. అప్పటి నుంచి నేటి వరకు కేవలం 12 శతఘ్నులను మాత్రమే సరఫరా చేసింది. కనీసం ఒక రెజిమెంట్ ఏర్పాటు చేయాలన్నా 18 శతఘ్నులు అవసరం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ప్రమాదాలు కూడా ఎక్కువే..

ఈ ఏడాది ఫిబ్రవరి 23న జమ్ముకశ్మీర్‌లోని అక్నూర్‌ సెక్టార్‌లో 105 ఎంఎం ఫీల్డ్‌గన్‌(ఫిరంగి వంటిది)తో లైవ్‌ ఫైరింగ్‌ డ్రిల్‌ జరుగుతోంది.  హఠాత్తుగా అది పేలిపోయింది.. దాని శకలాలు ముగ్గురు సైనికులను తాకాయి. వారిలో గన్నర్‌గా పనిచేస్తున్న సయాన్‌ ఘోష్‌ అక్కడికక్కడే కన్నుమూశాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో నెలలో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజిలో ఇదే రకమైన ఫిరంగితో జవాన్లు కాల్పులు సాధన చేస్తుండగా.. ఒక తూటా ఆ ఫిరంగిలోనే పేలింది. దీంతో బీఎస్‌ఎఫ్ జవాను సతీష్‌కుమారు కన్నుమూశాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.ఈ రెండు ఘటనల్లో వాడిన మందుగుండును ప్రభుత్వ రంగానికి చెందిన ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు కర్మాగారాల్లో తయారు చేశారు. సైన్యం అంతర్గత నివేదికల ప్రకారం 2014-2019 వరకు ఈ సంస్థ తయారు చేసిన ఆయుధాల కారణంగా 400కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.  దాదాపు రూ.903 కోట్ల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ సొమ్ముతో దాదాపు 100 శతఘ్నులను కొనుగోలు చేయవచ్చు. కానీ, ఓఎఫ్‌బీ మాత్రం ఈ ప్రమాదాల్లో కేవలం 19శాతం మాత్రమే తమ ఆయుధాల వల్ల జరిగాయని చెబుతోంది. ఉత్పత్తి రంగంలోని పరిశ్రమలకు నాణ్యత విషయంలో బాధ్యత ఉండాలని ప్రభుత్వం భావించింది. ఈ ఏడాది జూన్‌16న మంత్రి వర్గం ఆమోదముద్ర పడింది.

ఉద్యోగుల ఆందోళన..

వాస్తవానికి కార్పొరేటీకరణను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వీటిల్లో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన భారతీయ మజ్దుర్‌ సంఘ్‌ కూడా ఉండటం విశేషం. 2019లో ప్రభుత్వానికి వినతి పంపాయి. వాణిజ్యపరంగా ఈ నిర్ణయం అంత ఫలవంతం కాదని పేర్కొన్నాయి. దీంతోపాటు గత 20 ఏళ్లుగా కార్పొరేటీకరణ అయిన కంపెనీలు ప్రైవేటీకరణ బాటపట్టాయని గుర్తుచేశాయి. కానీ, ఉద్యోగుల హక్కులను రక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో కొన్ని సంఘాలు ఆందోళనను విరమించాయి.

మార్పులు ఇలా..

41 ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీలను ఏడు ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ)లుగా చేసింది. 

* మ్యూనిషన్‌ ఇండియా లిమిటెడ్‌

* ఆర్మర్డ్‌ వెహికల్స్‌ నిగమ్‌ లిమిటెడ్‌

* అడ్వాన్స్‌డు వెపన్స్‌  అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌

* ట్రూప్‌ కంఫర్ట్స్‌ లిమిటెడ్‌

* యంత్ర ఇండియా లిమిటెడ్‌

* ఇండియా ఆప్టిల్‌ లిమిటెడ్‌

* గ్లైడర్స్‌ ఇండియా లిమిటెడ్‌

ఈ కంపెనీలు మొత్తం కార్పొరేట్‌ సంస్థలుగా పనిచేస్తాయి. వీటిపై 100శాతం ప్రభుత్వ యాజమాన్యం ఉంటుంది.

ఉద్యోగుల పరిస్థితి ఏమిటీ..

ఓఎఫ్‌బీలో పనిచేస్తున్న సుమారు 70 వేల మంది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో మార్పులు ఉండవని... రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే కార్పొరేటీకరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. డీపీఎస్‌యూల్లో చేరే ఓఎఫ్‌బీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మునుపటి నిబంధనలకు ఏమాత్రం తీసిపోవన్నారు. ఈ విషయంలో మార్గదర్శనం చేసేందుకు రక్షణ ఉత్పత్తి విభాగం నేతృత్వాన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని రక్షణశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆర్డ్‌నన్స్‌ ఫ్యాక్టరీ విశ్రాంత, ప్రస్తుత ఉద్యోగుల పింఛన్లను తమ శాఖకు కేటాయించే బడ్జెట్‌ నుంచే ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపింది. ‘‘2004, జనవరి 1 తర్వాత ఓఎఫ్‌బీలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్దేశించిన జాతీయ పింఛను పథకం వర్తిస్తుంది. కొత్త సంస్థలు కూడా ఇదే పథకాన్ని అమలుచేసే అవకాశముంది’’ అని రక్షణశాఖ తెలిపింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని