Fertilisers: రైతులకు కేంద్రం శుభవార్త.. ఎరువులపై రాయితీ భారీగా పెంపు

రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువులపై రాయితీని భారీగా పెంచింది.

Updated : 24 Sep 2022 16:28 IST

దిల్లీ: రసాయన ఎరువుల ధరల భారం నుంచి రైతులకు భారీ ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎరువులపై రాయితీని భారీగా పెంచింది. డీఏపీ ఎరువుపై ప్రస్తుతం బస్తాకు రూ.1200 రాయితీ ఇస్తుండగా.. దాన్ని రూ.1650కి పెంచింది. ఈ మేరకు మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సోమవారం వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరలకే ఎరువులు లభించేలా చూడాలన్న ఉద్దేశంతో సబ్సిడీని పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. 

తాజా నిర్ణయంతో బస్తా డీఏపీ ఎరువుపై రూ.1650 రాయితీ లభించనుంది. ఇక యూరియాపై సబ్సీడీని రూ.1500 నుంచి రూ.2000లకు పెంచింది. ఎన్‌పీకే ఎరువుపై రూ.900 రాయితీ ఇస్తుండగా.. ఇప్పుడు దాన్ని రూ.1015కు పెంచారు. ఎస్‌ఎస్‌బీపై రూ.315 సబ్సీడీ ఉండగా.. రూ.375కు పెంచారు. 

‘‘అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ రైతులకు పాత ధరకే ఎరువులను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే డీఏపీ, యూరియా సహా పలు ఎరువులపై రాయితీని పెంచాం. రబీ సీజన్‌లో ఎరువులపై సబ్సిడీ కోసం ప్రధాని మోదీ రూ.28వేల కోట్లు కేటాయించారు. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదని, అప్పుడు పంటలు సమృద్ధిగా పండుతాయని మోదీ ఆశిస్తున్నారు’’ అని మన్‌సుఖ్‌ మాండవీయ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని