Haiti: 16 మంది అమెరికన్ల కిడ్నాప్‌.. చంపేస్తామంటూ వీడియో విడుదల

కరీబియన్‌ ద్వీప దేశం హైతీలో అమెరిన్ల కిడ్నాప్‌ కలకలం రేపుతుతోంది. 16 మంది అమెరికా మిషనరీలను ఓ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసి.....

Published : 23 Oct 2021 01:12 IST

పోర్టౌ ప్రిన్స్‌: కరీబియన్‌ ద్వీప దేశం హైతీలో అమెరికన్ల కిడ్నాప్‌ కలకలం రేపుతోంది. 16 మంది అమెరికా మిషనరీలను ఓ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసి.. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తోంది. కెనడాకు చెందిన మరో క్రైస్తవ ప్రబోధకుడిని ఉగ్రవాదులు అపహరించారు. ప్రస్తుతం కరవు కాటకాలు నెలకొన్న హైతీలో అమెరికాకు చెందిన ఓ మిషనరీ సంస్థ సేవలందిస్తోంది. హైతీ రాజధాని పోర్టౌ ప్రిన్స్‌లోని ఓ అనాథాశ్రమం వద్ద ఉండగా ఈ 17 మందిని అత్యంత క్రూరమైన 400 మావోజో ముఠా అపహరించినట్లు పోలీసులు తెలిపారు.

తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే తాము కిడ్నాప్ చేసిన 17 మందిని హతమారుస్తామని హెచ్చరిస్తూ.. కిడ్నాప్ ముఠా నాయకుడు విల్సన్ జోసెఫ్ గురువారం ఓ వీడియో విడుదల చేశాడు. హైతీ ప్రధాని సహా పోలీసు చీఫ్‌ను సైతం ఈ సందర్భంగా బెదిరించాడు. ఈ 17 మందిని విడుదల చేయాలంటే ఒక్కొక్కరికి 1 మిలియన్ డాలర్లు ముట్టజెప్పాలంటూ ముఠా డిమాండ్ చేసిందని పోలీసులు పేర్కొన్నారు. అపహరణకు గురైన వారిలో అయిదు, రెండేళ్ల చిన్నారులు కూడా ఉన్నారని వారు తెలిపారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై అమెరికా స్పందించింది. ఈ అంశాన్ని క్షుణ్నంగా పర్యవేక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. మిషనరీల విడుదలకు హైతీ అధికారులతో చర్చలు సాగిస్తున్నట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని