India-China: ప్రపంచ వేదికపై చైనాకు భారత్‌ పంచ్‌..!

ప్రపంచ దేశాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఆయా దేశాల ప్రాధాన్యతలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి సహకారం అందిస్తున్నామని ఐక్యరాజ్యసమితికి

Published : 10 Nov 2021 11:20 IST

యునైటెడ్‌ నేషన్స్‌: ప్రపంచ దేశాలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఆయా దేశాల ప్రాధాన్యతలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి సహకారం అందిస్తున్నామని ఐక్యరాజ్యసమితికి భారత్‌ వెల్లడించింది. అంతేగానీ సాయం పేరుతో దేశాలపై రుణ భారాన్ని మోపబోమంటూ చైనాకు పరోక్షంగా గట్టి కౌంటర్‌ ఇచ్చింది. 

‘అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ: మినహాయింపులు, అసమానతలు, సంఘర్షణలు’ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో జరిగిన బహిరంగ చర్చలో భారత్‌ తరఫున కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి డా. రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొరుగు దేశం డ్రాగన్‌పై పరోక్షంగా విమర్శల వర్షం కురిపించారు. ‘‘పొరుగు దేశాలైనా, ఆఫ్రికన్‌ భాగస్వాములైనా లేదా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలైనా.. భారత్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. ఆ దేశాలు మరింత దృఢంగా మారేందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తూనే ఉంటుంది. ఆయా దేశాల ప్రాధాన్యతలకు కూడా గౌరవమిస్తుంది. మేం అందించే సాయం.. డిమాండ్ ఆధారంగా ఉంటుంది. ఉపాధి కల్పన, సామర్థ్య నిర్మాణానికి దోహదం చేస్తుందే తప్ప ఆ దేశాలకు రుణాభారాలను సృష్టించదు’’ అంటూ చైనాను ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

చైనా తన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టును ఉపయోగించి దేశాలను రుణ ఊబిలోకి నెట్టేస్తోందని, తద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని చలాయించాలని చూస్తోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఆసియా నుంచి ఆఫ్రికా వరకు పలు దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరుతో చైనా భారీ మొత్తంలో డబ్బు వెచ్చిస్తోంది. ఈ బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టుపై అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ గతంలో అనేకసార్లు విమర్శలు గుప్పించారు. చైనా దోపిడీకి పాల్పడుతోందని, ప్రాజెక్టు కోసం పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తూ చిన్న దేశాలను భారీ రుణ ఊబిలోకి నెట్టేస్తోందని ఆరోపించారు. ఇది ఆయా దేశాల సౌభ్రాతృత్వానికి ప్రమాదకరంగా మారుతోందని దుయ్యబట్టారు. తాజాగా ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత్.. ఐరాస వేదికగా చైనాకు కౌంటర్‌ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని