Chennai Rains: జలదిగ్బంధంలోనే చెన్నై.. రాత్రి నుంచి జోరువాన

భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని చెన్నై మహా నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై వీధులు జలమయమై నదులను

Published : 11 Nov 2021 12:02 IST

చెన్నై: భారీ వర్షాలు, వరదలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వీధులు జలమయమై నదులను తలపిస్తున్నాయి. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. 17 గంటలైనా.. చినుకు ఆగే సూచనలు కనిపించడంలేదు. అత్యధికంగా చోళవరంలో 22 సెంటీ మీటర్లు, గుమ్మిడిపూండీలో 18 సెంటీ మీటర్లు, ఎన్నూర్‌లో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాలోనూ సాయంత్రం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవారణశాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే చెన్నై, నారపట్నం, పుదుచ్చేరి కరైకాల్‌లో 3వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఏడు ఓడరేవుల్లో కూడా 3వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది. చెన్నైలో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
20 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌..

చెన్నై సహా ఉత్తర జిల్లాల్లో అతి భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. మొత్తం 20 జిల్లాలకు ఇది వర్తిస్తుంది. ఈ జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేశారు. ఇప్పటికే వర్షాల కారణంగా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. వరదల వల్ల చెన్నై శివారులో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

సాయంత్రం తీరం దాటే అవకాశం..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది. చెన్నై, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గురువారం సాయంత్రానికి మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా మహాబలిపురంలో పర్యాటక ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని