Ventilator: తక్కువ ఖర్చుతో పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా కారణంగా ఆక్సిజన్‌ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై అనేక మంది ప్రాణాలు విడిచారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించిన తరుణంలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా బాధించింది. వీటన్నింటికి పరిష్కారంగా కశ్మీర్‌ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఒక పోర్టబుల్ వెంటిలేటర్‌ను తయారు చేశారు.

Published : 16 Jun 2021 01:20 IST

స్క్రాప్‌ నుంచి తయారు చేసిన కశ్మీర్‌ విద్యార్థులు

శ్రీనగర్‌: కరోనా కారణంగా ఆక్సిజన్‌ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై అనేక మంది ప్రాణాలు విడిచారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించిన తరుణంలో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా బాధించింది. వీటన్నింటికి పరిష్కారంగా కశ్మీర్‌ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు ఒక పోర్టబుల్ వెంటిలేటర్‌ను తయారు చేశారు. వెంటిలేటర్ల కొరతను అధిగమించేందుకు ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సాజిద్‌ నూర్‌, జహంగిర్‌ తక్కువ ఖర్చుతో పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా వీరిద్దరి ఇళ్లలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నా.. వెంటిలేటర్‌ను తయారు చేయాలని స్క్రాప్‌ మెటీరియల్‌తో ప్రయోగాలు ప్రారంభించి చివరికి విజయవంతమయ్యారు.

సాధారణ వెంటిలేటర్లలా కాకుండా ఈ పోర్టబుల్‌ వెంటిలేటర్‌ను సెన్సర్లు, మైక్రో కంట్రోలర్లతో అనుసంధానించారు. దీని ఆధారంగా ఈసీజీ, శరీర ఉష్ణోగ్రతను ఎక్కడి నుంచైనా పర్యవేక్షించొచ్చు. దీన్ని ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ సహాయంతో మొబైల్‌కు అనుసంధానించి రోగి పరిస్థితిని మానిటర్‌ చేయొచ్చని సాజిద్‌, జహంగీర్‌ తెలిపారు. దీంతో వైద్యుల సహకారం పొందడం వీలవుతుందని వారు పేర్కొన్నారు. ఈ వెంటిలేటర్‌ను శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పరిశీలించింది. కొవిడ్‌-19 ఓపెన్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో ఇది మొదటిస్థానంలో నిలిచింది. దీని ధర రూ.20 వేల కంటే తక్కువేనని సాజిద్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని