Published : 24/02/2021 01:37 IST

అమెరికాలోనే కొవిడ్‌ మరణాలు ఎక్కువ..ఎందుకంటే!

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ 5లక్షల మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం, కొరియా, వియత్నాం యుద్ధాల్లో మొత్తం ఎంత మంది మరణించారో.. కొవిడ్‌ కారణంగా ఒక్క ఏడాదిలోనే అక్కడ అంతమంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాలో ఈ స్థాయిలో కరోనా మరణాలు చోటుచేసుకోవడం కలవరపెట్టే విషయమే. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని ఎల్మ్‌హర్ట్స్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణలు డాక్టర్‌ మస్సీ, మాంటెఫియోర్‌ గ్రూపునకు చెందిన నిపుణురాలు హాల్పెర్న్‌ అమెరికాలో అత్యధిక మరణాలు సంభవించడానికి గల కారణాలను విశ్లేషించారు.

దేశంలో కొవిడ్‌ ప్రవేశించకముందు ఇలాంటి మహమ్మారిలను నేరుగా ఎదుర్కొన్న అనుభవం అమెరికాకు లేదు. ముఖ్యంగా, కెనడాలో సార్స్‌ విజృంభించినప్పటికీ అమెరికాలో లేదు. మరో ప్రమాదకరమైన మెర్స్‌ కూడా అమెరికాలో వెలుగుచూడలేదు. ఇక ఎబోలా వంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారీ ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నప్పటికీ, అమెరికాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. కరోనా వైరస్‌ తీవ్రతను అంచనా వేయడంలో ఇవి కొంతవరకు కారణంగా నిపుణులు భావిస్తున్నారు. వీటితో పాటు అమెరికాలో అత్యధిక స్థాయిలో ఉండే ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థ, మాస్కులపై రాజకీయం వంటి అంశాలు వైరస్‌ వ్యాప్తి పెరుగుదలకు కారణాలుగా నిపుణులు పేర్కొంటున్నారు.

భారీ ప్రైవేటు ఆసుపత్రుల వ్యవస్థ..

‘తక్కువ జనాభా కలిగిన దేశాలు పటిష్ట ఆరోగ్య వ్యవస్థలతో తొందరగా ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనే అవకాశం ఏర్పడింది. 50 స్వతంత్ర రాష్ట్రాలు కలిగిన అమెరికాలో ఎక్కువ జనాభా ఉండడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల వ్యవస్థ భారీస్థాయిలో ఉంది. దీంతో ఒకేవిధమైన వ్యూహంతో ప్రతి ఒక్కరికీ సేవలందించడం కష్టమయ్యింది. వీటికి తోడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాలనా విభావం కరోనా వైరస్‌ను ఎదుర్కొన్న విధానం సరిగా ఉపయోగపడలేదు’ అని న్యూయార్క్‌లోని ఎల్మ్‌హర్ట్స్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణలు డాక్టర్‌ మస్సీ వెల్లడించారు. పీపీఈ కిట్లకోసం ప్రైవేటు ఆసుపత్రుల మధ్యే పోటీపడిన విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని, ఇలాంటి విషయాల్లో కలసికట్టుగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులు సమన్వయంగా వ్యవహరించ లేకపోయయని అభిప్రాయపడ్డారు. 

మాస్క్‌కు రాజకీయ రంగు

వైరస్‌ మహమ్మారి వణికిస్తోన్న వేళ.. మాస్క్‌ ధరించడం కూడా రాజకీయ అంశంగా మారడం పెద్ద సమస్య అని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇది పూర్తిగా ఆరోగ్యసంరక్షణ సమస్య అయినప్పటకీ ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఫెడరల్‌ ప్రభుత్వం ఇబ్బంది పడినట్లు న్యూయార్క్‌లోని మరో అంటువ్యాధుల నిపుణురాలు హాల్పెర్న్ ‌పేర్కొన్నారు. ఇక అక్కడి అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ మాస్కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీనితో పాటు కరోనా వైరస్‌పై అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహరించిన తీరును నిపుణులు గుర్తుచేస్తున్నారు.

అమెరికా నేర్చుకోవాల్సిందేమిటీ..?

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రులకు రోగుల తాకిడి ఎక్కువైతే ఏవిధంగా సమన్వయంతో ముందుకెళ్లాలనే విషయం ప్రైవేటు ఆసుపత్రులు నేర్చుకోవాల్సి ఉందని డాక్టర్‌ మస్సీ పేర్కొన్నారు. వీటితో పాటు అత్యవసర చికిత్స విభాగాలు(ఐసీయూ), వైద్య సిబ్బందిని నియమించుకోవడం వంటి విషయాల్లోనూ ముందుజాగ్రత్తగా ఉండటం కీలకమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటికి తగిన ఏర్పాట్లు చేయగలిగినట్లు నిపుణులు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలనే విషయాన్ని కరోనా మహమ్మారి తెలియజేసిందని హాల్పెర్న్ ‌నొక్కిచెప్పారు. నల్లజాతీయులు, లాటిన్‌కు చెందిన వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నట్లు వస్తోన్ నివేదికలు వివిధ వర్గాలపై అసమానతలను తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ, దాదాపు 70నుంచి 80శాతం మందికి ఇది అందినప్పుడే మాస్కు లేకుండా స్వేచ్ఛగా ఉండే వాతావరణం ఏర్పడుతుందని నిపుణుల అభిప్రాయం. అయితే, వ్యాక్సిన్‌లు ఎంతకాలం పాటు రక్షణ ఇస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో రాబోయే రోజుల్లో సంభవించే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ప్రాణ నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని