‘ఆ చర్య లైంగిక వేధింపుల కిందకు రాదు’

దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జనవరి 19న సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఈ తీర్పు వివాదాస్పదం కావడంతో.........

Updated : 28 Jan 2021 18:54 IST

బాంబే హైకోర్టు మరో తీర్పు

నాగ్‌పూర్‌: దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాకడం లైంగిక వేధింపుల కిందకు రాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జనవరి 19న సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఈ తీర్పు వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించింది. తాజాగా అదే బెంచ్‌ న్యాయమూర్తి అక్కడికి నాలుగు రోజుల ముందు ఇచ్చిన ఇదే తరహా తీర్పు సైతం తాజాగా వెలుగులోకి వచ్చింది. మైనర్‌ చేతులు పట్టకోవడం, ప్యాంట్‌ జిప్‌ తీయడం పోక్సో చట్టం (లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి ఉద్దేశించిన చట్టం) కింద లైంగిక వేధింపుల కిందకు రాదంటూ తీర్పు వెలువరించడం గమనార్హం.

కేసు ఇదీ..
2018 ఫిబ్రవరి 12న కుజూర్‌ అనే 50 ఏళ్ల వ్యక్తి ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఐదేళ్ల బాలిక మాత్రమే ఇంట్లో ఉంది. ఆమె తల్లి బయటకు వెళ్లింది. తల్లి తిరిగొచ్చేసరికి ఐదేళ్ల బాలిక చేతులు గట్టిగా పట్టుకుని, ప్యాంట్‌ జిప్‌ తొలగించిన స్థితిలో ఉన్న దృశ్యం ఆమెకు కనిపించింది. దీనిపై కోర్టును ఆశ్రయించడంతో కింది స్థాయి కోర్టు నిందితుడికి ఐదేళ్ల శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద ఇంట్లోకి చొరబడడం, దౌర్జన్యం, లైంగిక వేధింపులు, తీవ్రమైన లైంగిక వేధింపులు వంటి అభియోగాలపై వివిధ సెక్షన్ల కింద శిక్ష ఖరారు చేసింది.

దిగువస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పుపై కుజూర్‌ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై సింగిల్‌ బెంచ్‌ ఈ నెల 15న తీర్పు వెలువరించింది. లైంగిక దాడి చేయాలన్న ఉద్దేశంతో భౌతికంగా తాకినప్పుడు మాత్రమే పోక్సో చట్టం కింద ‘లైంగిక వేధింపులు’ కిందకు వస్తుందని సదరు చట్టం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విషయంలో బాధితురాలి తల్లి సాక్ష్యం ప్రకారం.. బాధితురాలి చేతులు పట్టుకోవడం, జిప్‌ తీయడం వంటివి లైంగిక వేధింపులకు కిందకు రావని ధర్మాసనం తెలిపింది. వేధింపులకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ మిగిలిన సెక్షన్ల కింద పాల్పడిన నేరాలకు గానూ అతడికి 5 నెలల శిక్ష విధించింది. నిందితుడు ఇప్పటికే సదరు శిక్ష అనుభవించిన నేపథ్యంలో ఇతర ఏ కేసులూ లేకపోతే తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి..
‘నేరుగా తాకితేనే వేధింపుల’న్న హైకోర్టు తీర్పుపై స్టే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని