Updated : 28/08/2021 17:49 IST

Afghanistan Crisis : డబ్బుల్లేని బ్యాంకుల ముందు ప్రజల ఆర్తనాదాలు..

కాబుల్‌లో హృదయ విదారక పరిస్థితులు 

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాలిబన్ల స్వాధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజల జీవనం రోజురోజుకీ మరింత దుర్భరంగా మారుతోంది. తాలిబన్లు ఎప్పుడేం చేస్తారో, ఏవైపు నుంచి ఏ ఉగ్రమూక ఆత్మాహుతి దాడులకు తెగబడుతుందో తెలియక అక్కడి జనం నిత్యం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ రాక్షస మూకల పాలనలో మగ్గిపోవడం ఇష్టంలేని అక్కడి ప్రజలు.. ఇన్నాళ్లూ బతికిన అఫ్గాన్‌ను వీడి పారిపోయేందుకు చేస్తున్న ప్రయత్నంలో అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో అక్కడి మహిళలు, చిన్నారుల పరిస్థితి మరింత హృదయ విదారకంగా మారింది. వేలాది మంది ప్రజలు కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్దకు చేరుకొని తరలింపు కోసం ఎదురుచూపులు, దాదాపు ఆర్నెళ్లుగా అందని వేతనాల కోసం వందలాది మంది ఉద్యోగులు బ్యాంకుల ఎదుట ఆందోళనల దృశ్యాలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి.

ఏటీఎంల వద్ద భారీ క్యూలు 

ఇదిలా ఉండగా.. తమ జీతాల కోసం ఉద్యోగులు బ్యాంకుల ముందు ఆందోళన దిగడం.. సామాన్యులు ఏటీఎం యంత్రాల వద్ద తమ డబ్బులు విత్‌డ్రా చేసుకొనేందుకు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు అక్కడి దారుణ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. న్యూ కాబుల్‌ బ్యాంకు ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు. గత మూడు నుంచి ఆర్నెళ్ల పాటు పెండింగ్‌లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మూడు రోజుల క్రితం బ్యాంకులు పునఃప్రారంభమైనప్పటికీ ఎవరూ డబ్బులు విత్‌ డ్రా చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవని బ్యాంక్‌ సిబ్బంది తెలిపారు. ఏటీఎం యంత్రాలు పనిచేస్తున్నప్పటికీ నగదు ఉపసంహరణపై పరిమితులు విధించడంతో జనానికి తిప్పలు తప్పడంలేదు. దీంతో భారీ సంఖ్యలో ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్దకు చేరుకొని క్యూలలో గంటల తరబడి వేచిచూస్తున్నారు.

చిన్నారులకు నీళ్లు ఇస్తున్న జవాన్‌ వీడియో వైరల్‌.. 

అఫ్గాన్‌లో అల్లకల్లోలం, గందరగోళ పరిస్థితుల మధ్య అక్కడి వీధుల్లో చిక్కుకుపోయినవారి  పట్ల కొందరు జవాన్లు మానవతా దృక్పథంతో సాయం చేస్తున్నారు. ఓ జవాను చిన్నారులకు నీళ్లు అందిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. సానుభూతి, మానవత్వం, ఒకరికి ఒకరు అండగా నిలవడం ఆదాయం కన్నా, వృద్ధి కన్నా ముఖ్యమైంది అంటూ భారత మాజీ సైనికుడు రాజ్‌ సహా పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌గా మారుతోంది. 

ఎంబసీ మూసివేసిన ఆస్ట్రేలియా

మరోవైపు, అఫ్గానిస్థాన్‌లో తమ రాయబార కార్యాలయాన్ని ఆస్ట్రేలియా మూసివేసింది. అక్కడి నుంచి సిబ్బందిని ఉపసంహరించుకొంది. అఫ్గాన్‌లో చిక్కుకున్న అనేక మంది పౌరులు ఆస్ట్రేలియా తిరిగి వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. అయితే, కాబుల్‌ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్ల తర్వాత తమ పౌరులను రప్పించేందుకు ఉత్తమ మార్గాలను రూపొందిస్తున్నట్టు భారత్‌లోని ఆస్ట్రేలియా హైకమిషనర్‌ బార్రీ ఓఫార్రెల్‌ తెలిపారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని