Covid Outbreak: వందలాది విమానాలు రద్దు.. బీజింగ్‌లో బూస్టర్‌ డోసుకు సై

చైనాలో కరోనా మళ్లీ ఉరుముతోన్న విషయం తెలిసిందే. దీంతో మహమ్మారి కట్టడికి ఈ దేశం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొన్ని కేసులు బయటపడినా.. లాక్‌డౌన్‌ విధిస్తోంది. ప్రయాణ నిబంధనలను కఠినతరం చేస్తోంది. రానున్న ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం...

Published : 29 Oct 2021 17:24 IST

బీజింగ్‌: చైనాలో కరోనా మళ్లీ ఉరుముతోన్న విషయం తెలిసిందే. దీంతో మహమ్మారి కట్టడికి ఈ దేశం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొన్ని కేసులు బయటపడినా.. లాక్‌డౌన్‌ విధిస్తోంది. ప్రయాణ నిబంధనలను కఠినతరం చేస్తోంది. రానున్న ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో దేశ రాజధాని బీజింగ్‌ అంతటా జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తాజాగా శుక్రవారం నగరంలోని రెండు విమానాశ్రయాల్లో వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది. నగరమంతటా కార్మికులకు బూస్టర్ డోసులు తప్పనిసరి చేసినట్లు అధికారిక మీడియా చైనా సెంట్రల్‌ టెలివిజన్‌ వెల్లడించింది. మరోవైపు ప్రజలంతా కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

60 లక్షల మంది లాక్‌డౌన్‌లో..

చైనాలో ప్రస్తుతం కేసుల సంఖ్య.. ఇతర దేశాలతో పోల్చితే చాలా తక్కువే. శుక్రవారం 48 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం నమోదైన 250 కంటే తక్కువే. కానీ.. వింటర్ ఒలింపిక్స్‌ నేపథ్యంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. గురువారం సైతం బీజింగ్‌కు వెళ్లే రెండు హై-స్పీడ్ రైళ్లను నిలిపేశారు. అందులోని 450 మంది ప్రయాణికులను కరోనా పరీక్షలకు పంపారు. మరోవైపు ప్రయాణాలు మానుకోవాలని హిలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్ అధికారులు.. స్థానికులను హెచ్చరించారు. ఈ ప్రావిన్స్‌ రాజధాని హార్బిన్‌ విమానాశ్రయంలో మూడో వంతు విమానాలను నిలిపివేశారు. ప్రస్తుతం చైనావ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది లాక్‌డౌన్‌లో ఉన్నారు. లాన్‌జౌలో 40 లక్షల మంది, ఎజిన్‌లో దాదాపు 35 వేల మంది ఇళ్లకే పరిమితమ్యారు. అనేక ప్రావిన్స్‌లు ప్రయాణికులకు నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని