Updated : 27/10/2021 04:16 IST

Poonch encounter: కార్మికులు ఇచ్చిన సమాచారంతో పూంచ్‌ ఎన్‌కౌంటర్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని కొందరు కార్మికులు సైన్యానికి ఉప్పందించడంతో పూంచ్‌ ఎన్‌కౌంటర్‌ మొదలైంది. అక్టోబర్‌ 10తేదీన ఇద్దరు వ్యక్తులు భారీ తుపాకులతో  పూంచ్‌లోని ఓ లేబర్‌ క్యాంప్‌కు వెళ్లారు.. అక్కడ ఓ కూలీ నుంచి ఫోన్‌ లాక్కొని సమీపంలోని ఆర్మీ క్యాంప్‌ దిశగా వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అక్కడి కూలీలు సైన్యానికి తెలియజేశారు. దీంతో ఆ ఫోన్‌పై నిఘా పెట్టిన అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ ఫోన్‌ పూంచ్‌-రాజౌరీ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్నట్లు తేలింది. ఫోన్‌ సంభాషణలను కూడా సైన్యం విని ఉగ్రవాదులు ఉన్న విషయాన్ని ధ్రవీకరించుకొని ఆపరేషన్‌ మొదలుపెట్టింది. తనిఖీలు మొదలుపెట్టిన ఒక్క రోజులోనే ఐదుగురు సభ్యులను భద్రతా దళాలు కోల్పోయాయి. 

ఉగ్రవాదులకు సాయం చేసి పారిపోతుండగా..

మెందహార్‌, పూంచ్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వీరు పూంచ్‌, మెందహార్‌ వద్ద ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులకు అవసరమైన వస్తువులను సరఫరా చేసినట్లు గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ మీదుగా నేపాల్‌కు పారిపోతున్న సమయంలో అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.   

ఉగ్రవాదులతో టచ్‌లో పాక్‌ మాజీ సైనికులు..

పాకిస్థాన్‌కు చెందిన మాజీ సైనిక సిబ్బంది పూంచ్‌ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఉగ్రవాదులతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. 2008 డిసెంబర్‌ - 2009 జనవరి మధ్య తొమ్మిది రోజులపాటు బాతా దురియా ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అప్పట్లో ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోయారు. ఈ సారి కూడా ఉగ్రవాదులు పారిపోయే అవకాశం ఉందని దళాలు అనుమానిస్తున్నాయి. 

కీలక దశకు ఎన్‌కౌంటర్‌..

దాదాపు 16 రోజులుగా జరుగుతున్న ఎన్‌కౌంటర్‌ కీలక దశకు వచ్చినట్లు రక్షణ శాఖ వర్గాలు ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశాయి. అదనపు బలగాలను కూడా ఎన్‌కౌంటర్‌ స్థలానికి తరలించి గుహల్లో కూంబింగ్‌ నిర్వహించి అనుమానం ఉన్న చోట్ల నిప్పుపెట్టడం, లేదా పేలుడు పదార్థాలను వాడి శానిటైజ్‌ చేస్తున్నారు. ఉగ్రమూక ఎన్‌కౌంటర్‌ స్థలం నుంచి తప్పించుకొన్నట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. 

చిక్కటి అడవుల్లో పశువుల కాపర్లు తాత్కాలిక గృహాలు నిర్మించుకొన్నారని జమ్ము అండ్‌ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదులు వీటిని వినియోగిస్తూ దాక్కొంటున్నారని అన్నారు. అంతేకాదు అడవులు చిక్కగా ఉండటంతో భద్రతా దళ సభ్యులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని