మయన్మార్‌పై తీర్మానం.. ఓటింగ్‌కు భారత్‌ దూరం

మయన్మార్‌లో రాజకీయ సంక్షోభానికి తెరదించి, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనికాధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించింది. కానీ దీనికి భారత్‌ దూరంగా ఉండడం గమనార్హం.

Updated : 19 Jun 2021 13:28 IST

న్యూయార్క్‌: మయన్మార్‌లో రాజకీయ సంక్షోభానికి తెరదించి, ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని సైనికాధికారులను కోరుతూ సర్వప్రతినిధి సభలో ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించింది. కానీ దీనికి భారత్‌ దూరంగా ఉంది.

మయన్మార్‌  రాజకీయ సంక్షోభానికి ఓ పరిష్కారం కనుగొనేందుకు ఇప్పటికే ప్రాంతీయ కూటమి అయిన ‘ఆసియాన్‌’ ప్రక్రియ ప్రారంభించిందని ఐరాసలో భారత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి వెల్లడించారు. ఈ ప్రయత్నాలకు సహకరించేలా ప్రస్తుతం ఐరాసలో ప్రవేశ పెట్టిన తీర్మానం లేదని స్పష్టం చేశారు. సరిహద్దులు పంచుకుంటున్న దేశంగా మయన్మార్‌లోని పరిస్థితులు, పొరుగు దేశాలపై వాటి ప్రభావంపై భారత్‌కు స్పష్టమైన అవగాహన ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మయన్మార్‌కు పొరుగున ఉన్న దేశాలను సంప్రదించకుండానే తీర్మానాన్ని రూపొందించడం సరైంది కాదన్నారు. దీంతో భారత్‌ అభిప్రాయాలు, ఉద్దేశాలను తీర్మానం ప్రతిబింబించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నామన్నారు. 

భారత్‌తో పాటు మయన్మార్‌కు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌, భూటాన్‌, చైనా, లావోస్‌, నేపాల్‌, థాయ్‌లాండ్‌, రష్యా సైతం ఓటింగ్‌కు దూరంగా ఉండడం గమనార్హం. ఒక్క బెలారస్ మాత్రమే తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా.. 119 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. మయన్మార్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని,  పాలన పగ్గాలను సైన్యం తమ చేతుల్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆంగ్‌ సాన్ సూకీ వంటి కీలక నేతల్ని ఇప్పటికీ నిర్బంధంలో ఉంచారు. సైనిక పాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలు చేస్తున్న నిరసనల్లో ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని