India Corona: 20 శాతం దాటిన కరోనా పాజిటివిటీరేటు

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కొత్త కేసులు మూడు లక్షలపైనే నమోదవుతున్నాయి.

Updated : 24 Jan 2022 11:16 IST

కాస్త తగ్గినా.. మూడు లక్షలపైనే కొత్త కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతి కొనసాగుతోంది. కొద్ది రోజులుగా మూడు లక్షలపైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం 14 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,06,064 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముందురోజు కంటే 27 వేల కేసులు తగ్గాయి. అందుకు నిర్ధారణ పరీక్షల సంఖ్యలో తగ్గుదల కూడా కారణంగా కనిపిస్తోంది. పాజిటివిటీ రేటు 17.7 శాతం నుంచి 20.7 శాతానికి ఎగబాకడం ఆందోళనకరంగా మారింది. అంటే పరీక్షలకు వచ్చే ప్రతి ఐదుగురిలో ఒకరికి వైరస్‌ నిర్ధారణ అవుతోందన్నమాట. ఒక్క కర్ణాటకలోనే 50 వేల కేసులొచ్చాయి. తర్వాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. 24 గంటల వ్యవధిలో 439 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండేళ్ల సమయంలో 3.95 కోట్ల మందికి వైరస్‌ సోకగా.. 4,89,848 మంది మరణించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.   

వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో క్రియాశీల  కేసులు 22 లక్షలు దాటాయి. మొత్తం కేసుల్లో ఈ సంఖ్య 5.69 శాతానికి సమానం. నిన్న ఒక్కరోజే 2,43,495 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.68 కోట్లు(93.07 శాతం)గా ఉన్నాయి. 

నిన్న సెలవు రోజు కావడంతో కేవలం 27 లక్షల మందికే టీకా అందింది. మొత్తంగా 162 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. కొద్ది రోజులుగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సువారికి మొదటి డోసు, ముప్పు పొంచి ఉన్న వర్గానికి ప్రికాషనరీ డోసు అందిస్తోన్న సంగతి తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని