International Flights: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు పొడిగించిన భారత్‌

కొవిడ్ ఉద్ధృతి వేళ కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై  నిషేధం పొడిగించింది. దాంతో ఫిబ్రవరి 28 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి.

Published : 19 Jan 2022 14:17 IST

దిల్లీ: కొవిడ్ ఉద్ధృతి వేళ కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. దాంతో ఫిబ్రవరి 28 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంతో జనవరి 31 వరకు షెడ్యూల్డ్‌ విమాన సర్వీసుల్ని భారత్ రద్దు చేసింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని మరో నెల రోజులు పొడిగిస్తూ బుధవారం డీజీసీఏ ప్రకటన జారీ చేసింది. 

‘భారత్‌ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులను ఫిబ్రవరి 28 అర్ధరాత్రి వరకు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం’ అని డీజీసీఏ పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రాకముందు అంతర్జాతీయంగా కొవిడ్ అదుపులో ఉన్నట్లు కనిపించడంతో గతేడాది డిసెంబర్ 15 నుంచి విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాలని కేంద్రం భావించింది. కానీ వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్ కారణంగా ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ వేరియంట్ కారణంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మనదేశంలో తాజా ఉద్ధృతికి ఈ వేరియంటే కారణమని నిపుణులు వెల్లడిస్తున్నారు.

కరోనా వైరస్‌ ఉద్ధృతితో 2020 మార్చి నుంచి అంతర్జాతీయ పాసింజర్‌ విమాన సర్వీసుల్ని భారత్‌ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే 2020 జులై నుంచి వందే భారత్‌ మిషన్‌ కింద ఎయిర్‌ బబుల్‌ ఏర్పాటు చేసి దాదాపు 40 దేశాలకు ప్రత్యేక విమానాలను నడుపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని