Published : 03 Mar 2021 17:12 IST

గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం!

ఉగ్రవాద ముద్రను చెరిపేసుకునేందుకు పాక్‌ తంటాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌ శాంతి మంత్రాన్ని దాయాది దేశం ఒడిసిపట్టుకుందా? అన్నంతగా సరిహద్దుల్లో తుపాకీ మోతలు నిలిచిపోయాయి. వారంరోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ దళాలు తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. పాకిస్థాన్‌ వైఖరిలో వచ్చిన ఈ అనూహ్యమైన మార్పుల వెనక తప్పనిసరి కారణాలు చాలానే ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదం అన్నది పాకిస్థాన్‌ విదేశీ విధానాల్లో ఒకటిగా మారిందన్నది భారత్‌ ఆరోపణ. దీనికి తగ్గట్టుగానే భారత్‌ను అస్థిరపరిచేందుకు ముష్కర మూకను దేశం మీదికి ఎగదోస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉగ్ర ముఠాలకు ఆవాసంతోపాటు ఆర్థిక సాయం అందిస్తూ అనేక సార్లు అంతర్జాతీయ సమాజం ఎదుట అడ్డంగా దొరికిపోయింది. 

ఆర్థికంగా చితికి..
ఉగ్రవాదంతోపాటు అంతర్గతంగా ఉన్న సమస్యలు, రాజకీయ పరమైన సమస్యలు పాకిస్థాన్‌ను ఆర్థికంగా చితికిపోయేలా చేశాయి. ప్రతి కార్యక్రమానికి ఇతరుల వద్ద దేబరించాల్సిన దుస్థితికి దిగజారింది. ఈ తరుణంలో ఆర్థిక చర్యల కార్యచరణా దళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) కూడా గ్రే కొరడా ఝుళిపించడంతో వచ్చే నిధులు కూడా నిలిచిపోయాయి. ఉగ్ర ముద్ర పోగొట్టుకుంటే తప్ప దాయాది దేశానికి పైసా రాలని పరిస్థితి. అందుకే ఆ మరక చెరిపేసుకునేందుకు ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాక్‌ శతవిధాలా ప్రయత్నిస్తోంది.

ఆ వార్తలతో ఉక్కిరిబిక్కిరి
అబొట్టాబాద్‌లో అల్‌ఖైదా అగ్ర నేతను అమెరికా దళాలు అంతమొందించడం సహా పాకిస్థాన్‌ రాజకీయ నాయకులతో బిన్‌ లాడెన్‌ ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఇటీవల వెలువడిన వార్తలు పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ క్రమంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ విధించిన గడువు కూడా ముంచుకొస్తుండటంతో తమ శత్రు దేశంగా భావించే భారత్‌తో శాంతి మంత్రం జపించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేయాలన్న భారత్‌ నిర్ణయానికి జై కొట్టడమే కాకుండా వాస్తవ రూపంలోకి తేవడంతో సరిహద్దుల్లో తుపాకుల మోతలు నిలిచిపోయాయి.

ఆగిన ఉగ్రమూకల ఎగుమతి
పాక్‌ సైన్యం సాయంతోనే ముష్కరులు ఇన్నాళ్లూ భారత్‌లోకి ప్రవేశించగలుగుతూ వచ్చారు. ఇష్టారీతిన భారత దళాలపై కాల్పులకు తెగబడుతూ ఉగ్రమూకలు భారత్‌లోకి వెళ్లేందుకు పాక్‌ సైన్యం అవకాశాలు కల్పించేది. ఇప్పుడు ఈ కాల్పులు ఆగాయంటే సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి పలికేందుకు ఇమ్రాన్‌ నేతృత్వంలోని పాక్‌ సమాయాత్తమవుతున్నట్లే. దీని ద్వారా ఎఫ్‌ఏటీఎఫ్‌ నిషేధం నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఈ నిర్ణయం దాయది నేలపై ఉన్న ఉగ్ర ముఠాలకు ఏమాత్రం రుచించకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ అంగీకరించాల్సి వచ్చింది.

నిర్మాణాలకు ఆటంకం కలగొద్దని..
ఎఫ్‌ఏటీఎఫ్‌తో పాటు మరో విషయం కూడా పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ప్రేరేపించింది. పాక్‌ నేలపై చైనా తలపెట్టిన సీపీఈసీ కారిడార్‌ పనులు ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగాలంటే సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం అత్యావశ్యం. ఇప్పటికే గిల్గిట్‌ బాల్టిస్థాన్‌ను పాక్‌లోని ఓ ప్రావిన్స్‌గా మారుస్తూ దాయాది అవసరమైన రాజ్యాంగ పరమైన ప్రక్రియను పూర్తి చేసింది. తద్వారా సీపెక్‌ వేగవంతమవుతుంది. చైనా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీఆర్‌ఐ ప్రాజెక్టు కూడా ఈ ప్రాంతం మీదుగానే వెళుతుంది. ఈ మొత్తం విషయాల్లో భారత్‌ ఎక్కువగా స్పందించకుండా ఉండాలంటే భారత్‌తో సరిహద్దుల్లో కయ్యం లేకుండా ఉండితీరాలి. ఇవన్నీ జరగాలంటే సరిహద్దుల్లో భారత్‌ వైపు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి. భారత భూభాగంలోకి ఉగ్రమూకల రాకపోకలు నిలిచిపోవాలి. అటు భారత్‌ కూడా జమ్మూకశ్మీర్‌లో చేపట్టే ప్రాజెక్టులు వేగంగా సాగాలని కోరుకుంటోంది. అందుకు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొనడం అవసరం. అందుకే ఉభయతారకంగా భారత్‌ చేసిన ప్రతిపాదనను పాక్‌ వెంటనే అమలుచేసి చూపించింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం పటిష్ఠంగా అమలవుతుంది అన్నదానిపై సందేహాలు అలానే ఉన్నాయి!


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్