Drone Attack: ఇది పెద్ద సవాల్‌..

సైనిక స్థావరాలు, వ్యాపార సంస్థలపై డ్రోన్లతో దాడులు జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరముందని ఐక్యరాజ్యసమితిలో భారత్ నినదించింది....

Published : 29 Jun 2021 21:45 IST

న్యూయార్క్‌: సైనిక స్థావరాలు, వ్యాపార సంస్థలపై డ్రోన్లతో దాడులు జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం తీవ్రంగా దృష్టి సారించాల్సిన అవసరముందని ఐక్యరాజ్యసమితిలో భారత్ కోరింది. నిఘా సమాచార సేకరణ, ఆయుధాల చేరవేతకు డ్రోన్లను ఉపయోగించడం ప్రపంచ భద్రతా సంస్థలకు తీవ్రమైన సవాల్‌గా మారిందని హోంశాఖ అంతర్గత భద్రత ప్రత్యేక కార్యదర్శి వీఎస్‌కే కౌముది పేర్కొన్నారు. ఉగ్రవాద సమస్యపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన సదస్సులో పాల్గొన్న కౌముది పలు అంశాలను లేవనెత్తారు. అధునాతన సాంకేతికతను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడం తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు. అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లోని సమాచారం, సాంకేతికతను ఉగ్రవాద ప్రచారం కోసం దుర్వినియోగం చేస్తే.. వారిపై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్నిన అవసముందన్నారు. ఇలాంటి వాటి కట్టడికి ప్రపంచ దేశాలు బహుళ వ్యూహాలను అనుసరించాలని కౌముది సూచించారు.

ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్లు జమ్మూ వైమానిక స్థావరంలోకి ప్రవేశించి ఓ భనవంపై, అక్కడే ఉన్న ఖాళీ ప్రదేశంపై బాంబులు జారవిడిచిన విషయం తెలిసిందే. ఆరు నిమిషాల వ్యవధిలో ఈ  రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో భవనం పైకప్పు ధ్వంసమైంది. కాగా ఈ ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత జమ్మూలోని మరో సైనిక స్థావరంపై దాడిని సైన్యం భగ్నం చేసింది. రత్నచక్‌, కాలూచక్‌ సైనిక ప్రాంతంపై ఆదివారం రాత్రి 11.45 గంటలకు ఒక డ్రోన్‌, అర్ధరాత్రి తర్వాత 2.40 గంటలకు ఇంకో డ్రోన్‌ తిరిగాయి. వీటి కదలికలను వెంటనే కనిపెట్టిన సైన్యం అప్రమత్తమై కాల్పులు జరిపింది. కాగా అవి చీకట్లో వేగంగా తప్పించుకొన్నాయి.

డ్రోన్‌ దాడి ఘటన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు అప్పగించింది. దాడికి ఉపయోగించిన పేలుడు పదార్థాలపై జాతీయ భద్రతాదళం (ఎన్‌ఎస్‌జీ)కు చెందిన ప్రత్యేక స్క్వాడ్‌ బృందం విచారణ చేపట్టింది. ఆర్డీఎక్స్‌ లేదా టీఎన్‌టీ బాంబులను ఉపయోగించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిహద్దుల నుంచే ఈ డ్రోన్లను నియంత్రించి ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని