Updated : 04/05/2021 18:00 IST

Anthony Fauci: సంక్షోభ వేళ సైన్యాన్ని దించండి!

ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సూచన

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వల్ల భారత్‌లో ఏర్పడ్డ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని రంగంలోకి దించడంతోపాటు అన్ని వనరులను వినియోగించుకోవాలని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ సూచించారు. వైరస్‌ ఉద్ధృతి, సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాల్లో సైన్యం సహాయంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేవలం వైద్య పరికరాలే కాకుండా సిబ్బంది కోసం ఇతర దేశాల సహాయాన్ని భారత్‌ తీసుకోవాలని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు.

కొన్నివారాల లాక్‌డౌన్‌ అవసరం..!

దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి తక్షణమే కొన్ని వారాల పాటు పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని అమెరికా అధ్యక్షునికి ప్రధాన ఆరోగ్య సలహాదారుగా ఉన్న ఆంటోనీ ఫౌచీ పునరుద్ఘాటించారు. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూకే వంటి దేశాలు ఈ తరహా నిర్ణయాలతోనే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేశాయని అన్నారు. భారత్‌లో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలా చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో చేయడం వల్ల కరోనా సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయవచ్చని సూచించారు.

సైన్యం సహాయం అవసరమే..

ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టేక్కేందుకు భారత్‌ తక్షణమే మధ్య, దీర్ఘకాలిక  చర్యలు చేపట్టవచ్చని ఫౌచీ పేర్కొన్నారు. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైన్యం సహాయంతో క్షేత్రస్థాయిలో ఆసుపత్రులను నిర్మించుకోవాలని సూచించారు. గతేడాది చైనాకు సంక్షోభ సమయం ఎదురైనప్పుడు అత్యంత వేగంగా ఆసుపత్రులను నిర్మించడం, అందుకు అన్ని వనరులను వాడుకున్న సందర్భాన్ని గుర్తుచేశారు. యుద్ధ సమయాల్లో ఏర్పాటు చేసుకునే విధంగా సైన్యం సహకారంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమవుతుందన్నారు. తద్వారా అనారోగ్యంతో ఆసుపత్రి పడకలు అవసరమయ్యే బాధితులకు వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని ఫౌచీ సూచించారు.

ప్రపంచ దేశాలు ముందుకు రావాలి..

దేశంలో రోజువారీ కేసుల సంఖ్య మూడున్నర నుంచి నాలుగు లక్షలుగా ఉండడంతో భారత్‌ భయంకరమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అమెరికా మాదిరిగానే ఇతర దేశాలు కూడా భారీస్థాయిలో భారత్‌కు సహాయం అందించేందుకు ముందుకు రావాలని  అభిప్రాయపడ్డారు. వైద్యపరికరాలే కాకుండా సిబ్బందిని కూడా పంపించాలని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందనే విషయం అందరికీ స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా కొద్దీ ప్రతి ఒక్కరి సంరక్షణ చూసుకోవడం ఇబ్బందికరమని.. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌, వైద్య సదుపాయల కొరత ఏర్పడడం అసాధారణ పరిస్థితులకు దారితీస్తాయని చెప్పారు. అందుచేత సాధ్యమైనంత వరకు సహాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని కోరుకుంటున్నట్లు ఫౌచీ పేర్కొన్నారు.

భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ పంపిణీ అవసరం..

వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు కట్టడికి చర్యలతోపాటే వ్యాక్సినేషన్‌ను కూడా భారీ స్థాయిలో చేపట్టాలని ఆంటోనీ ఫౌచీ సూచించారు. భారత్‌లో తయారవుతోన్న రెండు వ్యాక్సిన్‌లతో పాటే అమెరికా, రష్యా వంటి దేశాలు, వ్యాక్సిన్‌ సరఫరాకు ముందుకొచ్చే కంపెనీల నుంచి వ్యాక్సిన్‌లను సమకూర్చుకోవాలని సూచించారు. అయితే, ఈ వ్యాక్సిన్‌ల వల్ల వచ్చే ఫలితాల్లో మరికొన్ని వారాల్లో కనిపిస్తాయని.. అందువల్ల ప్రస్తుతం ఆసుపత్రుల్లో కొనసాగుతున్న ఆక్సిజన్‌, చికిత్స భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు.

ఇదిలాఉంటే, భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 2కోట్ల మార్కును దాటగా.. 2లక్షల 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే భారత్‌లో జనాభాలో నాలుగో వంతున్న అమెరికాలో మాత్రం కేసుల సంఖ్య 3.2 కోట్ల మందిలో బయటపడగా, మరణాల సంఖ్య 5లక్షల 77వేలు దాటింది. అయితే, సరిపడ స్థాయిలోలేని ఆరోగ్య మౌలికసదుపాయాలు, బలహీన ఆర్థిక శక్తి, సెకండ్‌ వేవ్‌ ప్రభావం వల్ల భారీస్థాయిలో ఇన్‌ఫెక్షన్‌ పెరగడం వంటి సమస్యలతో పాటు ఆక్సిజన్‌, ఐసీయూ పడకల కొరత భారత్‌ను తీవ్రంగా వేధిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని