Pakistan: మైనారిటీలపై అత్యాచారాలు నిత్యకృత్యం!

పాకిస్థాన్‌లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడులపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కడ బలవంతపు మత మార్పిడులు రోజువారీగా జరిగే ఘటనలని పేర్కొంది.

Published : 23 Jun 2021 22:33 IST

ఐరాసలో పాక్‌ తీరును ఎండగట్టిన భారత్‌

జెనీవా: పాకిస్థాన్‌లో అల్పసంఖ్యాక వర్గాలపై జరుగుతున్న దాడుల గురించి భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా అక్కడ బలవంతపు మత మార్పిడులు రోజువారీ ఘటనలని పేర్కొంది. ప్రతి ఏటా వేల మంది బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల ఘటనలపై పాక్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి సమావేశాల్లో కశ్మీర్‌ సమస్యను పాకిస్థాన్‌ లేవనెత్తడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్‌.. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై దాయాది అకృత్యాలను మరోసారి ఎండగట్టింది.

‘పాకిస్థాన్‌లో కొన్ని అల్పసంఖ్యాక మతాలకు చెందినవారిని బలవంతపు మత మార్పిడులు చేయిస్తుండటం నిత్యకృత్యం. మైనర్‌ అమ్మాయిలను అపహరించడం, అత్యాచారాలు, దౌర్జన్యపూరిత వివాహాలు జరుగుతూనే ఉంటాయి. వీటిని అడ్డుకునే వారిపై హింసకు పాల్పడే ఘటనలకు అడ్డూ అదుపు ఉండదు. పవిత్ర ప్రార్థనాలయాలపై  దాడులు, ధ్వంసం చేసే ఘటనలు ఎక్కువయ్యాయి’ అని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి (UNHRC) 47వ సమావేశాల్లో భాగంగా భారత శాశ్వత కమిషన్‌ కార్యదర్శి పవన్‌ బదే పేర్కొన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వంతపాడుతూ.. వారిని ఆర్థికంగా ఆదుకునే విధానాలకు మద్దతు పలుకుతోన్న పాకిస్థాన్‌ను జవాబుదారీ చేయాలని ప్రపంచ దేశాలకు భారత్‌ పిలుపునిచ్చింది.

ఇక పాకిస్థాన్‌లో జరుగుతోన్న అత్యాచారాలకు అక్కడి మహిళల వస్త్రధారణ ఓ కారణమని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయిలు రెచ్చగొట్టే రీతిలో పొట్టి దుస్తులు వేసుకుంటే అబ్బాయిలపై ప్రభావం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ‘కురచ బట్టలు వేసుకునే అమ్మాయిలను చూస్తే అబ్బాయిలపై ప్రభావం పడకుండా ఉండదు.. వారు రోబోలైతే తప్ప! అలాంటి వస్త్రాలు ధరించకపోవడం ద్వారా లైంగిక దాడుల్ని నివారించవచ్చు. రెచ్చగొట్టే వైఖరిని నివారించాలంటే పర్దాలు ధరించాలి’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ తీవ్రంగా ఖండించడంతో పాటు అంతర్జాతీయంగా మహిళా సంఘాలు ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని