Afghanistan: అఫ్గాన్‌ పరిణామాలపై ఉన్నతస్థాయి చర్చలకు ఏర్పాట్లు

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమయ్యాక.. అక్కడి పరిణామాలు, పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూనే ఉన్నాయి. ఆ దేశం ఉగ్రవాదులకు అడ్డాగా మారకూడదని, ఈ విషయంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి! ఇదే క్రమంలో భారత్‌ కూడ.. అఫ్గాన్‌ పరిణామాలపై...

Published : 05 Nov 2021 20:32 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమయ్యాక.. అక్కడి పరిణామాలు, పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూనే ఉన్నాయి. ఆ దేశం ఉగ్రవాదులకు అడ్డాగా మారకూడదని, అందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి! ఇదే క్రమంలో భారత్‌ కూడా.. అఫ్గాన్‌ పరిణామాలపై తన ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ‘ప్రాంతీయ భద్రతా చర్చల’కు ఆతిథ్యం ఇవ్వనుంది. సంబంధిత వర్గాలు శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. నవంబర్ 10న నిర్వహించనున్న ఈ చర్చలకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అధ్యక్షత వహిస్తారని తెలిపాయి. 2018, 2019లోనూ ఇరాన్‌లో ఈ తరహా చర్చలు నిర్వహించగా, కరోనా కారణంగా గతేడాది రద్దు చేశారు.

ఇంకా సమాధానం చెప్పని పాక్‌, చైనా..

చర్చల నేపథ్యంలో భారత్‌.. రష్యా, ఇరాన్‌, చైనా, పాకిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాలకు ఆహ్వానం పంపింది. వాటి నుంచి విశేష స్పందన కూడ లభించినట్లు తెలిపింది! రష్యా, ఇరాన్‌.. తాము చర్చల్లో పాల్గొంటామని ఖరారు చేసినట్లు సమాచారం. అఫ్గాన్‌ ఇరుగు పొరుగు దేశాలే కాకుండా, మధ్య ఆసియా దేశాలూ ఇందులో పాల్గొంటుండటం విశేషం. అఫ్గాన్‌లో శాంతి, భద్రతలను పెంపొందించేందుకు భారత్‌కు ఉన్న ప్రాధాన్యానికి.. ఈ స్పందనే నిదర్శనమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పాకిస్థాన్‌, చైనాలు తమ సమాధానం చెప్పాల్సి ఉంది. అయితే తాము మాత్రం హాజరుకాబోమని పాక్‌.. స్థానిక మీడియాకు వెల్లడించింది! దీనిపై ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘పాక్‌ నిర్ణయం దురదృష్టకరం. కానీ, ఆశ్చర్యం కలిగించేది కాదు. అఫ్గాన్‌ను తన రక్షిత ప్రాంతంగా చూస్తున్న దాని వైఖరిని ఇది ప్రతిబింబిస్తుంది. గతంలోనూ పాక్‌ ఈ తరహా సమావేశాలకు హాజరు కాలేద’ని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని