Published : 19/10/2021 02:08 IST

Shock treatment: త్రిశూలం ధాటికి చైనా సైన్యం గిలగిలా కొట్టుకోవాల్సిందే..!

ప్రాణహానిలేని ఆయుధాలు సిద్ధం చేస్తున్న భారత సైన్యం!

దిల్లీ: చైనాకు షాక్‌ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు భారత బలగాలు సిద్ధమయ్యాయి. గల్వాన్‌ లోయ వద్ద చోటుచేసుకున్న ఘర్షణల్లో మన సైన్యంపై ఇనుపరాడ్ల తరహా ఆయుధాలతో డ్రాగన్‌ మూకలు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. అప్పుడు చైనా బలగాల దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్‌ సైన్యం ఇప్పుడు నూతన ఆయుధాలను సమకూర్చుకుంది! సరిహద్దుల్లో కాల్పులు జరిపే ఆయుధాలను వినియోగించరాదని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉన్న నేపథ్యంలో ప్రాణహాని లేని ఆయుధాలు తయారుచేయిస్తోంది!

శివుడి చేతిలోని త్రిశూలం.. ఇప్పుడు భారత బలగాల చేతిలో ఆయుధంగా మారింది. ఇదిగో ఈ గ్లౌజ్‌ తొడుక్కొని ఒక్క పంచ్‌ ఇస్తే చైనా సైనికుడు మూర్ఛపోవాల్సిందే. ఈ లాఠీలు తాకితే చాలు డ్రాగన్‌ బలగాలు కిందపడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. గల్వాన్‌ లోయ వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణలో వీరసైనికుల మరణంతో ప్రాణహానిలేని ఆయుధాలపై భద్రతా బలగాలు దృష్టిపెట్టాయి. 1996, 2005 సంవత్సరాల్లో భారత్‌-చైనా మధ్య ఒడంబడిక కారణంగా సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యాలు కాల్పులు జరిపే ఆయుధాలను ఉపయోగించకూడదు. దీంతో చైనా బలగాలు  ఇనుపరాడ్లు, ఇనుపముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపై దాడి చేశాయి. ఈ ఒప్పందం దృష్ట్యా భారత్‌ కూడా ప్రాణహాని లేని ఆయుధాలను తయారు చేసింది. గల్వాన్‌ ఘర్షణ జరిగిన వెంటనే నోయిడాలోని అపాస్టెరాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  అనే సంస్థకు ఈ ఆయుధాల తయారీ బాధ్యతను భద్రతా దళాలు అప్పగించాయి. 

సరిహద్దుల్లో చైనా బలగాలను ఎదుర్కొనేందుకు వీలుగా ఎక్కడికైనా వీటిని సులువుగా తీసుకెళ్లేలా ప్రాణహాని లేనివిధంగా ఈ ఆయుధాలను తయారు చేశారు. పరమశివుడి చేతిలోని త్రిశూలం ఆధారంగా కూడా ఆయుధాన్ని తయారుచేశారు. గల్వాన్‌ ఘర్షణలో చైనీయులు తమ సంప్రదాయ ఆయుధాలను వాడారనీ, అందుకే తాము  కూడా భారత సంప్రదాయాన్ని చాటుతూ త్రిశూలాన్ని తయారుచేసినట్టు అపాస్టెరాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మోహిత్‌ కుమార్‌ వెల్లడించారు. 

‘‘గతేడాది గల్వాన్‌లో భారత్‌-చైనా మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో చైనా బలగాలు భారత సైనికులపైకి ఇనుపరాడ్లు, టేసర్‌లను ప్రయోగించాయి. దీనికి గట్టిగా బదులిచ్చేందుకు భారత భద్రతా దళాలు ప్రాణహానిలేని ఆయుధాలు తయారు చేసే ప్రాజెక్టును మాకు అప్పగించాయి. భద్రతా బలగాలకు ఈ ఆయుధాలు అందించడం ప్రారంభించాం. వారి నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. ‘వజ్ర’ పేరుతో మెరుపులతో కూడిన మెటల్‌ డివైజ్‌ను మా సంస్థ తయారు చేసింది. శత్రు సైనికులపై దాడి చేసేందుకు వారి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను పంక్చర్‌ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. త్రిశూలం నుంచి కూడా విద్యుత్ సరఫరా అవుతుంది. దాంతో ప్రత్యర్థి సెకెన్ల వ్యవధిలోనే అపస్మారకస్థితికి గురవుతాడు. సప్పర్‌ పంచ్‌ పేరుతో తయారుచేసిన గ్లౌజ్‌ కూడా ఇదే తరహాలో పనిచేస్తుంది. ఈ ఆయుధాలేవీ శత్రువుల ప్రాణాలు తీయవు. వారిని షాక్‌కు గురిచేస్తాయి’’ ’’ అని మోహిత్‌ వివరించారు.

అయితే, భారత బలగాలు ఈ ఆయుధాలు తయారుచేయాలని ఎప్పుడు తమను అడిగాయన్న అంశంపై మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. ఈ ఆయుధాలను ప్రైవేటు వ్యక్తులు, సామాన్య ప్రజలకు మాత్రం విక్రయించబోమని తేల్చి చెప్పారు. భద్రతా బలగాలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు మాత్రమే విక్రయించనున్నట్టు తెలిపారు. మరోవైపు, ఈ ఆయుధాలు భద్రతా బలగాల కోసం తీసుకొంటున్నట్టు ప్రభుత్వం/సాయుధ దళాల ప్రతినిధుల నుంచి అధికారిక ప్రకటన కూడా ఏమీలేదు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని