మిరామ్‌ తరోన్‌ ‘కిడ్నాప్‌’.. చైనా బలగాలతో ఆర్మీ సంప్రదింపులు..!

అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడిని చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వస్తోన్న వార్తలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ ఉదంతంపై ప్రతిపక్షాల నుంచి

Updated : 20 Jan 2022 15:28 IST

దిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడిని చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వస్తోన్న వార్తలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ ఉదంతంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. అదృశ్యమైన యువకుడి కోసం చైనా బలగాలతో హాట్‌లైన్‌ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణశాఖ వర్గాలు గురువారం వెల్లడించాయి.

అసలేం జరిగిందంటే..

అప్పర్‌ సియాంగ్‌ జిల్లా జిడో గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు మిరామ్‌ తరోన్‌ను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బలగాలు అపహరించుకుని వెళ్లినట్లు అరుణాచల్‌ తూర్పు ఎంపీ తాపిర్‌ గావో బుధవారం ట్విటర్‌లో వెల్లడించారు. సాంగ్‌పో నది (ఈ నదిని అస్సాంలో బ్రహ్మపుత్రగా పిలుస్తారు) అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించే చోట మంగళవారం ఈ ఘటన జరిగిందని చెప్పారు. మిరామ్‌తో పాటే ఉన్న అతడి స్నేహితుడు జానీ యాయింగ్‌ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఎంపీ ట్విటర్లో పేర్కొన్నారు. చైనా చర్య గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేశానని.. మిరామ్‌ను త్వరగా విడిపించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని తాపిర్‌ విజ్ఞప్తి చేశారు. అయితే అరుణాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం, భారత ఆర్మీ వర్గాలు మాత్రం ఈ ఘటనను ‘అదృశ్యం’గా పేర్కొనడం గమనార్హం. వాస్తవాధీన రేఖ సరిహద్దుల్లో మూలికలు సేకరించడంతో వేటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 

చైనాను సంప్రదించాం..

ఘటనపై రక్షణ మంతిత్వ శాఖ వర్గాలు స్పందించాయి. ‘‘అరుణాచల్‌ ప్రదేశ్‌లోని భారత సరిహద్దుల్లో యువకుడి అదృశ్యం గురించి సమాచారం తెలియగానే.. భారత ఆర్మీ హాట్‌లైన్‌ ద్వారా చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ సైనికులను సంప్రదించింది. వేటకు వచ్చిన ఓ యువకుడు దారి తప్పి కన్పించకుండా పోయిన విషయాన్ని చైనా బలగాలకు చేరవేశాం. యువకుడి ఆచూకీ కనుగొని ప్రోటోకాల్స్‌ ప్రకారం అతడిని భారత్‌కు అప్పగించాలని కోరాం’’ అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. 

మోదీకి పట్టడం లేదా..?: రాహుల్‌ గాంధీ

‘మిరామ్‌ తరోన్‌ ‘కిడ్నాప్‌’ వ్యవహారంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. ‘‘గణతంత్ర దినోత్సవానికి కొద్ది రోజుల ముందు ఓ యువకుడిని చైనా కిడ్నాప్‌ చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మిరామ్‌ కుటుంబానికి మేం అండగా ఉంటాం. విశ్వాసం కోల్పోవద్దు. ఓటమిని అంగీకరించొద్దు’’ అని రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. ఘటనపై మోదీ మౌనంగా ఉన్నారంటే దానర్థం.. ఆయనకు ఏం పట్టడం లేదా? అంటూ దుయ్యబట్టారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు