Omicron: ఒమిక్రాన్‌ కేసులు.. ఇజ్రాయెల్‌ కీలక నిర్ణయం

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కట్టడికి ఇజ్రాయెల్‌ కఠిన చర్యలు తీసుకుంటోంది. స్థానికంగా ఇప్పటివరకు మూడు ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి నివారణకుగానూ ఆదివారం సాయంత్రం నుంచి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించనున్నట్లు అధికారులు...

Published : 28 Nov 2021 19:06 IST

జెరుసలేం: కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ కట్టడికి ఇజ్రాయెల్‌ కఠిన చర్యలు తీసుకుంటోంది. స్థానికంగా ఇప్పటివరకు మూడు ఈ కొత్త రకం కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్‌ వ్యాప్తి నివారణకుగానూ ఆదివారం సాయంత్రం నుంచి విదేశీయుల ప్రవేశంపై నిషేధం విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ప్రత్యేక కేసులు మినహా విదేశీ పౌరులకు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశంపై నిషేధం ఉంటుంది’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆదివారం సాయంత్రం నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.  విదేశాల నుంచి వచ్చే ఇజ్రాయెల్‌ పౌరులకు మాత్రం ప్రవేశానికి అనుమతి ఉంది. అయితే వారు.. ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. వీరిలో వ్యాక్సినేషన్‌ పూర్తయినవారు మూడు రోజులు, కానివారు ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

క్వారంటైన్‌లో బాధితులు..

కొవిడ్ కారణంగా సుదీర్ఘకాలంగా నిలిపివేసిన తన అంతర్జాతీయ రాకపోకలను ఇజ్రాయెల్‌ నెల క్రితమే పునరుద్ధరించింది. ఇటీవల మలావి నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ బయటపడటంతో.. వెంటనే అప్రమత్తమైంది. అనంతరం విదేశాలనుంచి వచ్చిన మరో ఇద్దరిలో ఈ వేరియంట్‌ వెలుగుచూసింది. దీంతో ఈ ముగ్గురిని క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు భవిష్యత్తులో పరీక్షల కోసం కోటి ఆర్టీ పీసీఆర్‌ కిట్‌లకు ఆర్డర్ పెట్టనున్నట్లు చెప్పారు. 90 లక్షలుగా ఉన్న ఈ దేశ జనాభాలో ఇప్పటివరకు దాదాపు 50.7 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

* ఒమిక్రాన్‌ కలవరంపై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల ప్రయాణికులను కట్టడి చేస్తున్నాయి. అక్కడినుంచి వస్తున్నవారిని పరీక్షలు నిర్వహిస్తూ, క్వారంటైన్‌లో ఉంచుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా న్యూజిలాండ్‌ సైతం తొమ్మిది ఆఫ్రికన్‌ దేశాలపై ఆంక్షలు విధించింది. థాయ్‌లాండ్‌ కూడ ఆఫ్రికా పర్యాటకులపై తాత్కాలిక నిషేధం విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని