IT Rules: సామాన్య యూజర్ల సాధికారత కోసమే..!

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలపై ఐక్యరాజ్య సమితి లేవనెత్తిన ఆందోళనలపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Published : 21 Jun 2021 01:16 IST

ఐక్యరాజ్యసమితికి స్పష్టం చేసిన భారత్‌

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలపై ఐక్యరాజ్యసమితి లేవనెత్తిన ఆందోళనలపై భారత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సామాజిక మాధ్యమాలను వినియోగించే సాధారణ యూజర్ల సాధికారత కోసమే నూతన నిబంధనలు రూపొందించామని స్పష్టం చేసింది. అంతేకాకుండా పౌర సమాజం, ఇతర భాగస్వామ్యపక్షాలతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నూతన ఐటీ నిబంధనలను రూపొందించామని వెల్లడించింది.

‘సామాజిక మాధ్యమాల్లో సామాన్య వినియోగదారుల సాధికారత కోసమే ఈ నియమాలు రూపొందించాం. వివిధ భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నూతన ఐటీ నిబంధనలు ఖరారు చేశాం. సోషల్‌ మీడియా దుర్వినియోగం కారణంగా బాధితులైన వారి వేదనను పరిష్కరించడానికి ఇదొక వేదిక అవుతుంది’ అని ఐరాసకు రాసిన లేఖలో భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా సోషల్‌ మీడియాతోపాటు డిజిటల్‌ వేదికలపై వేధింపులు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం నియామకాలు, అశ్లీల కంటెంట్‌, ఆర్థిక మోసాలు, హింసను ప్రేరేపించే సమాచార వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని ఈ నూతన ఐటీ నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.

భారత్‌ తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు అంతర్జాతీయ మానవ హక్కుల నియమావళిని పాటించలేదని ఐరాస అభిప్రాయపడింది. వీటిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి చెందిన ముగ్గురు ప్రతినిధులు జూన్‌ 11న కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం, సోషల్‌ మీడియాలో సాధారణ యూజర్ల ప్రయోజనాల కోసమే నూతన ఐటీ నిబంధనలు-2021 రూపొందించామని బదులిచ్చింది. ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు ఈ ఏడాది మే 26నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని