Jammu Kashmir: వివాదాస్పద ఎన్‌కౌంటర్‌పై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం

శ్రీనగర్‌లోని హైదర్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు సోమవారం చేపట్టిన ఎన్‌కౌంటర్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వ్యాపారి మహమ్మద్‌ అల్తాఫ్‌ భట్‌, వైద్యుడు ముదాసిర్‌ గుల్‌ అమాయకులని వారి కుటుంబ సభ్యులతోసహా స్థానిక నేతలు...

Published : 18 Nov 2021 14:00 IST

శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని హైదర్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు సోమవారం నిర్వహించిన ఎన్‌కౌంటర్‌ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వ్యాపారి మహమ్మద్‌ అల్తాఫ్‌ భట్‌, వైద్యుడు ముదాసిర్‌ గుల్‌ అమాయకులని వారి కుటుంబ సభ్యులతో సహా స్థానిక నేతలు వాపోతున్నారు. దీంతో ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాల్సిందేనంటూ పెద్దఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌ పాలనాయంత్రాంగం గురువారం ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అదనపు జిల్లా మెజిస్ట్రేట్ (ఏడీఎం) ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. 

‘తప్పు జరిగితే అందుకు సిద్ధమే..’

‘హైదర్‌పోరా ఎన్‌కౌంటర్‌లో ఏడీఎం ర్యాంక్ స్థాయి అధికారితో మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించాం. నిర్ణీత సమయంలోగా నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. అమాయక పౌరుల భద్రతకు స్థానిక యంత్రాంగం కట్టుబడి ఉంది. వారికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తుంది’ అని గవర్నర్‌ కార్యాలయం ట్వీట్‌లో పేర్కొంది. మరోవైపు స్థానిక డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ సైతం ఈ వ్యవహారంపై ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. ‘ఏం జరిగిందో అన్న విషయాన్ని పోలీసు విచారణ వెలుగులోకి తెస్తుంది. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే.. సరిదిద్దుకునేందుకు సిద్ధమే’ అని అన్నారు.

‘ఉగ్రవాదులతో సంబంధాలు లేవు’

హైదర్‌పోరా ఎన్‌కౌంటర్‌లో ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాది సహా నలుగురిని భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనలో మృతి చెందిన అల్తాఫ్‌ భట్‌, ముదాసిర్‌ గుల్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని, ఎదురుకాల్పుల సమయంలో వీరిద్దరినీ పోలీసులు రక్షణ కవచంగా వాడుకొన్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వీరు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినట్లు భద్రతాదళాలు చెబుతున్నాయి. దీనిపై న్యాయవిచారణ జరపాలంటూ జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని