Joe Biden: జిన్‌పింగ్‌ను ఒప్పించలేకపోయిన బైడెన్‌..?

సుదీర్ఘకాలం తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. చైనా అధ్యక్షడు షీ జిన్‌పింగ్‌ ఇటీవల ఫోన్లో మాట్లాడుకున్నారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్‌ కాల్‌..

Updated : 15 Sep 2021 14:19 IST

వాషింగ్టన్‌: సుదీర్ఘకాలం తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. చైనా అధ్యక్షడు షీ జిన్‌పింగ్‌ ఇటీవల ఫోన్లో మాట్లాడుకున్నారు. దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్‌ కాల్‌లో ఇరు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించారు. అయితే ఈ సందర్భంగా ముఖాముఖీగా భేటీ అవుదామని బైడెన్ కోరగా.. జిన్‌పింగ్‌ అందుకు తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజం కాదని బైడెన్‌ తాజాగా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

చైనాలోని కింది స్థాయి అధికారులు అమెరికాతో చర్చలకు సానుకూలంగా స్పందించకపోవడంతో బైడెన్‌ రంగంలోకి దిగారు. గతవారం చైనా అధినేతకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఆ సందర్భంగా ఇరువురం ముఖాముఖీ సమావేశమవుదామని బైడెన్‌.. జిన్‌పింగ్‌ను కోరారని ఈ వ్యవహారంతో సంబంధమున్న విశ్వసనీయ వర్గాలు చెప్పినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అక్టోబరులో ఇటలీలో జరిగే జీ20 సదస్సు ఈ భేటీకి వేదిక కావాలని భావిస్తున్నట్లు బైడెన్‌ చెప్పారట. దీనిపై తమ నిర్ణయాన్ని వెంటనే చెప్పాల్సిన అవసరం లేదని చైనా అన్నట్లు తెలుస్తోంది. అయితే బైడెన్‌ ఆఫర్‌ను జిన్‌పింగ్ తిరస్కరించడమే గాక, చైనాతో సంబంధాలపై అమెరికా తన స్వరాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిదని సూచించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

కాగా.. ఈ వార్తలను బైడెన్ జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ ఖండించారు. ఆ కథనాలు నిజం కాదని పేర్కొన్నారు. అంతేగాక, రెండు దేశాల అధినేతల మధ్య ప్రైవేటు సంభాషణను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఈ వార్తలు కచ్చితంగా నిజమే అని విశ్వసనీయ వర్గాలు చెప్పడం గమనార్హం. ఈ కథనాలపై తాజాగా కొందరు విలేకరులు బైడెన్‌ను ప్రశ్నించగా.. ‘అది నిజం కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చైనా నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు.

ఇదిలా ఉండగా.. గతేడాది కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చినప్పటి నుంచి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తమ దేశం విడిచి బయటకు రావట్లేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని