Karnataka: కరోనా సూపర్‌ స్ప్రెడర్‌ ఈవెంట్‌.. ఆ కాలేజీలో 182కు చేరిన కేసులు

కర్ణాటకలోని ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన కళాశాల ఈవెంట్‌.. కరోనా సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది. ఆ కళాశాలలో కరోనా సోకిన వారి సంఖ్య తాజాగా 182కు పెరిగింది

Updated : 26 Nov 2021 12:42 IST

బెంగళూరు: కర్ణాటకలోని ధార్వాడ్‌ మెడికల్‌ కాలేజీలో జరిగిన కళాశాల ఈవెంట్‌.. కరోనా సూపర్‌ స్ప్రెడర్‌గా మారింది. ఆ కళాశాలలో కరోనా సోకిన వారి సంఖ్య తాజాగా 182కు పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కాలేజీలోని మొత్తం సిబ్బంది, విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా.. వైరస్‌ బారిన పడినవారిలో చాలా మంది టీకా రెండు డోసులు తీసుకున్నవారే కావడంతో వారందరికీ స్వల్ప లక్షణాలు మాత్రమే కన్పిస్తున్నాయని తెలిపారు.

ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం కాలేజ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చదువుతున్న విద్యార్థులు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం కళాశాలలోని దాదాపు 300 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 66 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మరో 100 మందికి పైగా విద్యార్థులకు టెస్టు ఫలితాలు శుక్రవారం వచ్చాయి. దీంతో ఇప్పటివరకు కాలేజీలో 182 మంది కరోనా బారినపడినట్లు అధికారులు తెలిపారు.

నవంబరు 17న కాలేజీలో ఫ్రెషర్స్‌ పార్టీ జరిగింది. ఈ వేడుకలతోనే వైరస్‌ వ్యాప్తి జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వైరస్ సోకిన వారిలో చాలా మంది ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వీరంతా క్యాంపస్‌ హాస్టళ్లలోనే క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. వీరి రక్త నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. బాధితుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. కాగా.. ఈ కాలేజీలో మొత్తం 3000 వరకు విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వీరందరికీ వైరస్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు దాదాపు 1000 మందికి పరీక్షలు నిర్వహించగా.. వీరి ఫలితాలు రావాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని