
Kartarpur: కేంద్రం శుభవార్త.. రేపటినుంచి కర్తార్‌పుర్ కారిడార్ పునఃప్రారంభం
దిల్లీ: సిక్కు మతస్థులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పాకిస్థాన్‌లోని పవిత్ర దర్బార్ సాహిబ్ గురుద్వారాను పంజాబ్‌లో ఉన్న డేరా బాబా నానక్ గురుద్వారాను అనుసంధానించే ‘కర్తార్‌పుర్ సాహిబ్ కారిడార్’ను బుధవారం నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 19న గురునానక్ జయంతి(గురుపూరబ్) సందర్భంగా ప్రార్థనలకు వీలుగా ఈ కారిడార్‌ను తెరవాలని కోరుతూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సహా పెద్ద సంఖ్యలో సిక్కు పెద్దలు కేంద్రాన్ని అభ్యర్థించిన విషయం తెలిసిందే. పలువురు భాజపా నేతలు దిల్లీలో ప్రధాని మోదీని సైతం కలిశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
‘సిక్కు యాత్రికులకు ప్రయోజనం’
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో సిక్కు యాత్రికులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం గురునానక్ దేవ్, సిక్కు మతస్థుల పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న అపార గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 2019లో ప్రారంభమైన ఈ కారిడార్.. మహమ్మారి వ్యాప్తి కారణంగా మూతపడిన విషయం తెలిసిందే. యాత్రికులు వీసా అనుమతులు లేకుండానే ఈ మార్గం ద్వారా పాక్‌లోని గురుద్వారాను సందర్శించవచ్చు.