Corona: కేరళలో భారీగా కొవిడ్‌ కేసులు.. ఆదివారాల్లో అత్యవసర సేవలకేఅనుమతి!

దేశంలో కరోనా మహమ్మారి ఉరుముతోంది. ఒమిక్రాన్‌ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలో గతంలో ఎన్నడూ లేనంతగా ......

Updated : 20 Jan 2022 23:39 IST

తిరువనంతపురం: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి ఉరుముతోంది. ఒమిక్రాన్‌ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా కేరళలో గతంలో ఎన్నడూ లేనంతగా కొవిడ్ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 1.15 లక్షల టెస్టులు చేయగా.. 46,387 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించినప్పట్నుంచి అక్కడ ఇంత భారీగా రోజువారీ కేసులు రావడం ఇదే తొలిసారి. గతేడాది మే 12న అత్యధికంగా 43,529 కొవిడ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.

కొత్త కేసులతో కలుపుకొంటే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,87,898కి పెరిగింది. మరోవైపు, కొవిడ్ బాధితుల్లో 341 మంది మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,501కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,99,041గా ఉంది. తిరువనంతపురంలో అత్యధికంగా 9,720 కొత్త కేసులు రాగా.. ఎర్నాకుళంలో 9605, కోలికోడ్‌ 4016 చొప్పున కొవిడ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు, కేరళలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యా పెరుగుతోంది. కొత్తగా మరో 62 ఒమిక్రాన్‌ కేసులు బయటపడటంతో అక్కడ కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య 707కి పెరిగినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

ఆదివారాల్లో అత్యవసరసేవలకే అనుమతి!

కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో మరింత అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం పలు ఆంక్షలు ప్రకటించింది. వైద్యం కోసం అమెరికా వెళ్లిన సీఎం పినరయి విజయన్‌ అక్కడి నుంచే అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వచ్చే రెండు ఆదివారాల్లోనూ పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించనుంది. ఈ నెల 23, 30 తేదీల్లో అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించనున్నారు. రెండేళ్ల లోపు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులతో పాటు క్యాన్సర్‌ రోగులు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వర్క్‌ఫ్రం హోం సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, బీచ్‌లు, పార్కులు వంటి పర్యాటక ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఆదివారాల్లో మాల్స్‌, సినిమా థియేటర్లు మూసి ఉంచనున్నారు. అలాగే, అన్ని తరగతులనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఆయా జిల్లాల్లో నమోదైన కేసుల ఆధారంగా జిల్లా అధికార యంత్రాంగాలు కొత్త ఆంక్షలు అమలుచేసేందుకు అవకాశం కల్పించారు.

కేసుల తీవ్రత, ఆస్పత్రిపాలైన వారి సంఖ్యను బట్టి రాష్ట్రంలోని జిల్లాలను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజించి ఆంక్షలు అమలుచేయనున్నారు. తిరువనంతపురంతో పాటు పాలక్కడ్‌, ఇడుక్కి, వయనాడ్‌ జిల్లాలు కేటగిరీ -బిగా విభజించారు. ఆయా జిల్లాల్లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన, బహిరంగ సమావేశాలకు అనుమతిలేదు. మత సంబంధమైన కార్యక్రమాలు ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. వివాహాలు, అంత్యక్రియలు వంటి సామాజిక కార్యక్రమాలకు 20మంది మించరాదని స్పష్టంచేశారు. అలాగే, ఎర్నాకుళం, కొల్లం, అళప్పుజ కేటగిరీ- ఏ జిల్లాలు. ఆ జిల్లాల్లో పైన పేర్కొన్న కార్యక్రమాలకు 50మందికి మించరాదు. సీ- కేటగిరీలో ఇప్పటివరకు ఏ జిల్లాలనూ చేర్చలేదు. అక్కడ జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌కు అనుమతిలేదు. వివాహాలు, అంత్యక్రియలకు కేవలం 20మంది వరకే అనుమతించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని