Updated : 30/06/2021 12:58 IST

Kim Jong Un: కిమ్‌కు భయం పట్టుకుందా?

ఆయన నోటి వెంట వచ్చిన ఆ సంక్షోభం ఏంటి?

ప్యాంగ్యాంగ్‌: ఇప్పటి వరకు తమ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని చెప్పుకుంటూ వచ్చిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. మహమ్మారి కట్టడి నిబంధనల అమలులో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేసినట్లు అధికారిక మీడియా కేసీఎన్‌ఏ పేర్కొంది. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కిమ్‌.. వారిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపింది.

సంక్షోభం ఏంటి?

అధికారుల నిర్లక్ష్యం దేశ, ప్రజల భద్రత విషయంలో పెను సంక్షోభానికి దారితీస్తోందని కిమ్‌ వ్యాఖ్యానించినట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. దేశంలో చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి పనులకు అధికారుల నిర్లక్ష్యం అడ్డంకిగా మారిందని ఆయన అన్నట్లు పేర్కొంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది..? కరోనా కేసులు నమోదవుతున్నాయా? కిమ్‌ పేర్కొంటున్న సంక్షోభం ఏంటి? అన్ని దానిపై మాత్రం కేసీఎన్‌ఏ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

కునారిల్లుతున్న ఆరోగ్య వ్యవస్థలు..

తమ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ఇటీవల కిమ్‌ డబ్ల్యూహెచ్‌ఓకు పంపిన నివేదికలో పేర్కొన్నారు. అయితే, దీనిపై అమెరికా, జపాన్‌ మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మహమ్మారి కట్టడి నిమిత్తం ఉత్తర కొరియా కఠిన ఆంక్షలు విధించింది. బయటి దేశాలతో పెద్దగా సంబంధాలు లేని ఆ దేశం.. ఉన్న అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనాతోనూ సరిహద్దులు మూసేసింది. దీంతో అక్కడ భారీ ఆహార, ఆర్థిక సంక్షోభం నెలకొంది. మరోవైపు సంప్రదాయ వైద్య వసతులతో కునారిల్లుతున్న ఆ దేశ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలు మహమ్మారి చికిత్సను ఏమాత్రం భరించలేని స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కిమ్‌ ఆది నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

కుంగుతున్న ఆర్థికానికి కరోనా పెను ప్రమాదం..

కిమ్‌ పేర్కొన్న సంక్షోభం ఎలాంటిది అన్న దానిపై ఓ నిర్ధారణకు రావడం తొందరపాటు అవుతుందని ఆ దేశ వ్యవహారాలపై పట్టున్న దక్షిణ కొరియా నిపుణుడు చియోంగ్‌-సియోంగ్‌-చాంగ్‌ అన్నారు. అయితే, టెస్టింగ్‌ కిట్ల లేమి, వైద్య వసతుల దయనీయ స్థితి వల్ల తొలి నుంచి ఉత్తర కొరియా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు మహమ్మారి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని కిమ్‌ సర్కార్‌ భావిస్తున్నట్లుందని పేర్కొన్నారు.

టీకాల స్వీకరణకూ అనుమానాలు..

మరోవైపు డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో సమానత్వం కోసం ఏర్పాటైన కొవాక్స్‌ కూటమి ద్వారా ఉత్తర కొరియాకు ఇప్పటి వరకు ఒక్క డోసు కూడా చేరలేదు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ వ్యాక్సిన్ల పంపిణీ వ్యవస్థ గవీ జూన్‌లో ప్రకటించింది. కొవాక్స్ కూటమి నిబంధనల ప్రకారం ఉత్తర కొరియాకు మే నాటికి 1.7 మిలియన్ డోసులు అందాల్సి ఉందని జపాన్‌ ప్రముఖ వార్తా సంస్థ క్యోడో న్యూస్‌ ఇటీవల పేర్కొంది. కానీ, కొవాక్స్‌ మార్గదర్శకాలు, నిబంధనలను అమలు చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా లేకపోవడంతో  టీకాలు వారికి చేరలేదని తెలిపింది. వ్యాక్సిన్లను తీసుకొచ్చే విదేశీయుల వల్ల కూడా దేశంలోకి వైరస్ ప్రవేశించే అవకాశం ఉందని కిమ్‌ యంత్రాంగం భావిస్తున్నట్లు సమాచారం. పైగా వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇటీవల అక్కడి ఓ ప్రధాన వార్తా పత్రిక రోడోంగ్‌ సిన్‌మున్‌ కథనం ప్రచురించింది.

అందుకే సన్నబడ్డారా?

ఇక ఇటీవల కిమ్‌ బాగా సన్నబడ్డట్లు కేసీఎన్‌ఏలో ప్రచురితమైన ఓ కథనం ధ్రువీకరించింది. ఆయన సన్నబడడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా తెలిపింది. అయితే, ఆయన ఆరోగ్యంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అనారోగ్యం వల్లే ఆయన సన్నబడి ఉంటారని కొంతమంది వాదిస్తుంటే.. కరోనా సోకి ఉంటుందని మరికొంత మంది అనుమానిస్తున్నారు. మరోవైపు దేశం తీవ్ర ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజల్లో అసంతృప్తి నెలకొనకుండా.. వారి సానుభూతి కోసమే ఇలాంటి జిత్తులకు తెరతీస్తున్నారన్న వాదన కూడా ఉంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని