అందుకు వారే కారణం.. కిమ్‌

నూతన ఆలోచనలు, విధానాల అమలులో వారు విఫలమయ్యారని కిమ్‌ మండిపడ్డారు.

Published : 12 Feb 2021 15:11 IST

ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంపై మండిపడ్డ నియంత

ప్యాంగాంగ్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ తొమ్మిది సంవత్సరాల పాలనలో అత్యంత క్లిష్ట దశ ప్రస్తుతం కొనసాగుతోంది. కరోనాతో సహా పలు కారణాల వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. కాగా, దీనికి మంత్రివర్గమే కారణమంటూ కిమ్‌ విరుచుకుపడ్డారు. క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అవసరమైన నూతన ఆలోచనలు, విధానాల అమలులో వారు విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.

‘‘ఆర్థిక రంగంలో ముఖ్య పాత్ర పోషించటంలో క్యాబినెట్‌ విఫలమైంది. కీలక అంశాలను అదుపులో ఉంచేందుకు అవసరమైన ప్రణాళికలు రచించటంలో అది ఘోరంగా దెబ్బతింది. వివిధ మంత్రిత్వ శాఖలు అందజేసిన గణాంకాలను యాంత్రికంగా సమర్పించింది’’ అని కిమ్‌ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఒకనెల క్రితమే నియమించిన ఆర్థిక అత్యున్నతాధికారి ఒకరిని విధుల్లోంచి తొలగించారు.

ఆర్థిక తుపాను రానుందా?

ఉత్తర కొరియా అణువిధానం పట్ల అసహనం వ్యక్తం చేసిన అమెరికా.. ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది. ఈ పరిస్థితిని దౌత్య విధానం ద్వారా చక్కదిద్దుకోవాలన్న కిమ్‌ ఆశలకు.. ట్రంప్‌తో చర్చలు విఫలం కావటంతో గండిపడింది. ఇక గత సంవత్సరం చోటుచేసుకున్న కరోనా కట్టడి కోసం సరిహద్దుల మూసివేత, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం వంటి అంశాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఆర్థిక ప్రణాళికలు విఫలమయ్యాయని అంగీకరిస్తూ కిమ్‌ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితికి దారితీశాయి. ఇవే పరిస్థితులు ఇంకా కొనసాగితే ఆర్ధికంగా పెను తుపాను సృష్టిస్తాయని.. మార్కెట్లను అతలాకుతలం చేసి, ప్రజల్లో అశాంతి, ఆందోళనకు కారణమౌతాయని విశ్లేషకులు అంటున్నారు.

కాగా, జనవరిలో జరిగిన వర్కర్స్‌ పార్టీ సమావేశంలో దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు నూతన పంచవర్ష ప్రణాళికను ప్రతిపాదించారు. దేశీయ మార్కెట్లను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నట్టు పొరుగు దేశం దక్షిణ కొరియా వెల్లడించింది. ఇందులో భాగంగా అమెరికా డాలర్‌తో సహా పలు ఇతర దేశాల కరెన్సీల వినియోగంపై ఆంక్షలు విధించినట్టు తెలిసింది.

ఇవీ చదవండి..

సార్‌.. మా అబ్బాయి వేలైనా ఇవ్వండి!

జిన్‌పింగ్‌కు బైడెన్‌ కాల్‌: ఏం చెప్పారంటే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని