Kim Sister: అమెరికాతో చర్చల్లేవ్‌..!

అమెరికాతో సంప్రదింపులు పునరుద్ధరించే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా నియంత కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ (Kim Yo Jong) స్పష్టం చేశారు.

Published : 23 Jun 2021 01:28 IST

అమెరికాపై మండిపడ్డ కిమ్‌ సోదరి

సియోల్‌: అమెరికాతో సంప్రదింపులు, ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలని ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ (Kim Jong Un) చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా ఉన్నాయని అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై తాజాగా స్పందించిన కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ (Kim Yo Jong).. అమెరికాతో సంప్రదింపులు పునరుద్ధరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలకు తావులేదన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయంటూ అమెరికా వేస్తోన్న అంచనాలు.. వారిని మరింత నిరాశకు గురిచేస్తాయని అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా వ్యవహారాలను పర్యవేక్షించే అమెరికా దౌత్యవేత్త సంగ్‌ కిమ్‌, దక్షిణ కొరియాలో పర్యటిస్తోన్న నేపథ్యంలో కిమ్‌ సోదరి ఈ విధంగా స్పందించినట్లు అక్కడి అధికారిక వార్తా సంస్థ KCNA వెల్లడించింది.

అమెరికా కొత్త ప్రభుత్వాన్ని ఉటంకిస్తూ ‘చర్చలకైనా.. ఘర్షణకైనా సిద్ధంగా ఉండాలి’ అని తన సైన్యానికి కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఈమధ్యే సూచించారు. దీనిపై స్పందించిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలైవాన్‌, కిమ్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. అయితే వీటిపై మరింత స్పష్టమైన సంకేతాలు వచ్చేవరకు వేచిచూస్తామని.. తాము మాత్రం ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా నుంచి సానుకూల ప్రకటన వస్తుందని అమెరికా భావించింది. కానీ, ఉత్తరకొరియా నియంత సోదరి మాత్రం చర్చల పునరుద్ధరణకు తావులేదని స్పష్టం చేయడం గమనార్హం.

అమెరికాలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కిమ్‌ సర్కారు మాత్రం ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా అణుపరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామని ఉత్తర కొరియా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాతో అమెరికా చేస్తోన్న సైనిక విన్యాసాలు, శత్రువిధానాలను విడిచిపెట్టడంపైనే అమెరికాతో దౌత్య, ద్వైపాక్షిక సంబంధాలు ఆధారపడి ఉంటాయని తేల్చి చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని