మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణ దృష్ట్యా సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు......

Updated : 26 Mar 2021 22:24 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభణ దృష్ట్యా సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. గత కొన్ని వారాలుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు ఈ నెల 28 నుంచి (ఆదివారం రాత్రి) కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను సూచించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కట్టడి చర్యలపై డివిజనల్‌ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్పీలతో పాటు వైద్యాధికారులతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌ విధించడం తనకు ఇష్టంలేదన్నారు. అయితే, కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఆరోగ్య సంరక్షణ వసతులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కరోనా రోగులకు అవసరమైన పడకలు, మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. 

ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఉద్ధవ్‌ ఆదేశించారు. రాత్రిపూట కర్ఫ్యూకి సంబంధించిన ఉత్తర్వులను విపత్తు నిర్వహణ శాఖ త్వరలోనే విడుదల చేస్తుందని సీఎం కార్యాలయం వెల్లడించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాల్స్‌ మూసివేయాలని ఆదేశించింది.

కొత్త కేసుల్లో మరో రికార్డు

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కేసులు రోజుకో రికార్డు నమోదు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే దాదాపు 37వేల కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 36,902 కొత్త కేసులు, 112 మరణాలు నమోదు కాగా.. 17,019 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు 1,90,35,439 శాంపిల్స్‌ పరీక్షించగా.. 26,37,735 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 23,00,056 మంది కోలుకోగా.. 53,907 మంది మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో ప్రస్తుతం 2,82,451 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పుణెలో అత్యధికంగా 52,340 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ముంబయిలో 36404, నాసిక్‌ 20568, ఠానే 27474, ఔరంగాబాద్‌ 19063, నాందేడ్‌ 12943, నాగ్‌పుర్‌ 38348 చొప్పున ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని