Corona: ప్లీజ్‌.. అలాంటి పరిస్థితి తెచ్చుకోకండి.. కొవిడ్‌ రూల్స్‌ పాటించండి!

కరోనా మూడో దశ వస్తే మళ్లీ అన్నీ మూసివేసే పరిస్థితిని ప్రభుత్వానికి తెచ్చిపెట్టొద్దని కోరారు. శుక్రవారం ఆయన పుణెలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు........

Published : 04 Sep 2021 01:23 IST

ప్రజలకు అజిత్‌ పవార్‌ విజ్ఞప్తి

పుణె: కొవిడ్‌ నిబంధనలు పాటించడంలో ప్రజలు అలసత్వం ప్రదర్శించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. కరోనా మూడో దశ వస్తే మళ్లీ అన్నీ మూసివేసే పరిస్థితిని ప్రభుత్వానికి తెచ్చిపెట్టొద్దని కోరారు. శుక్రవారం ఆయన పుణెలో కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేరళ, మహారాష్ట్రలలో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసిందన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ గ్రామీణ ప్రాంతాల్లో కొందరు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. కరోనా మహమ్మారికి వారు భయపడటం లేదు. మాస్క్‌లు ధరించడంలేదు.. భౌతికదూరం పాటించడంలేదు. కరోనా మహమ్మారి ముగిసిపోయిందని భావిస్తున్నారు. ఇలాంటి వైఖరి ఇన్ఫెక్షన్లను మరింతగా పెరిగేలా చేస్తుందని’’ అని వ్యాఖ్యానించారు. 

పాఠశాలల పునఃప్రారంభంపై మాట్లాడుతూ.. నిపుణులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘స్కూళ్లు తెరిచే అంశంపై రెండు అభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు పాఠశాలలను దీపావళి తర్వాత తెరవాలని చెబుతుంటే.. ఇంకొంతమంది కరోనా పాజిటివిటీ రేటు సున్నా ఉన్న చోట బడులు తెరవొచ్చని చెబుతున్నారు. దీనిపై సీఎం ఉద్ధవ్‌ఠాక్రే పూర్తి నిర్ణయం తీసుకుంటారు’’ అని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాలను తెరవాలని భాజపా, ఎంఎన్‌ఎస్‌ పార్టీల డిమాండ్‌పైనా అజిత్‌ పవార్‌ స్పందించారు. రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికలు ఉన్నందున ప్రతి పార్టీ తన ఉనికిని చాటుకొనేందుకు ప్రయత్నిస్తుందని, అందుకే ఇలాంటి భావోద్వేగపూరిత అంశాలను లేవనెత్తుతున్నాయన్నారు. రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని, జనం ఎక్కడికక్కడ భారీగా గుమిగూడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వినాయక చవితి వేడుకల్లో పరిస్థితిని తొలి రోజు నుంచే సమీక్షిస్తామని, ఎక్కడైనా గుంపులుగా ఏర్పడితే ఆ మరుసటి రోజే కఠిన చర్యలు తీసుకుంటామని అజిత్ పవార్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని