NEET Scam: ‘రూ.50లక్షలిస్తే.. మీ పరీక్ష మేం రాసి సీటు ఇప్పిస్తాం..!’

వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో భారీ కుంభకోణం బయటపడింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో

Updated : 23 Sep 2021 13:08 IST

నీట్‌ పరీక్షలో భారీ కుంభకోణాన్ని గుర్తించిన సీబీఐ

దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలో భారీ కుంభకోణం బయటపడింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో పరీక్ష రాయిస్తామంటూ మహారాష్ట్రకు చెందిన ఓ కోచింగ్‌ సెంటర్‌ కొందరితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.50లక్షలు డిమాండ్‌ చేసినట్లు దర్యాప్తులో వెలుగుచూసిందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. 

నాగ్‌పూర్‌కు చెందిన ఓ కోచింగ్‌ సెంటర్‌ ఈ కుంభకోణానికి యత్నించినట్లు సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు ఇప్పిస్తామంటూ నీట్ అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకుంది. రూ.50లక్షలిస్తే అభ్యర్థుల స్థానంలో నకిలీ వ్యక్తులతో పరీక్ష రాయిస్తామని చెప్పినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకోసం అభ్యర్థుల నుంచి యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లు తీసుకుని.. అందులో విద్యార్థుల ఫొటోలు మార్ఫింగ్‌ చేసినట్లు తెలిసింది. అభ్యర్థుల ఈ-ఆధార్‌ కార్డులను తీసుకుని వాటితో నకిలీ ఐడీకార్డులు తయారుచేసినట్లు తెలిసింది. ఇలా కుదరకపోతే.. అభ్యర్థులకు ఆన్సర్‌ కీ పేపర్లు ఇవ్వడం, లేదా ఓఎంఆర్‌ షీట్‌ను మారుస్తామంటూ సదరు కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకుందట. 

ఈ నెల 12వ తేదీన నీట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు సెంటర్లలో ఈ స్కామ్ చేసేందుకు కోచింగ్‌ సెంటర్‌ ప్రయత్నించింది. అయితే ఈ కుంభకోణం గురించి సీబీఐకి ముందుగానే సమాచారం రావడంతో వారిని పట్టుకునేందుకు అధికారులు పరీక్షా కేంద్రాల్లో కాపుకాశారు. దీంతో కోచింగ్‌ సెంటర్‌ ప్రయత్నాలు ఫలించనట్లు తెలిసింది. అనంతరం కోచింగ్ సెంటర్‌ డైరెక్టర్‌, కొంతమంది విద్యార్థులపై సీబీఐ కేసు నమోదు చేసినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. కొద్ది రోజుల క్రితం నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓవైపు నీట్‌లో ఫెయిల్‌ అవుతామనే భయంతో తమిళనాడులో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వేళ.. ఈ కుంభకోణం వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని