Jammu- Kashmir: పానిపత్‌లో రెక్కీ.. అయోధ్యపై కన్ను!

స్వాతంత్ర్య దినోత్సవం వేళ దేశంలో దాడులకు ప్రణాళికలు రచించిన ఉగ్రవాదుల కుట్రను జమ్మూ- కశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. జైషే మొహమ్మద్‌ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను, వారి సహాయకులను శనివారం అరెస్టు చేశారు.  డ్రోన్ల సాయంతో జారవిడిచిన ఆయుధాలను తీసుకునేందుకు వారు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Published : 14 Aug 2021 18:45 IST

ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన జమ్మూ పోలీసులు

శ్రీనగర్‌: స్వాతంత్ర్యదినోత్సవ వేళ దేశంలో దాడులకు ప్రణాళికలు రచించిన ఉగ్రవాదుల కుట్రను జమ్మూ- కశ్మీర్‌ పోలీసులు భగ్నం చేశారు. జైషే మొహమ్మద్‌ సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులను, వారి సహాయకులను శనివారం అరెస్టు చేశారు.  డ్రోన్ల సాయంతో జారవిడిచిన ఆయుధాలను తీసుకునేందుకు వారు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. జమ్మూలో బాంబు పేలుడుతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దాడులకు వారు ప్లాన్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు 15న దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయన్న నిఘా వర్గాల సమాచారం మేరకు జమ్మూ-కశ్మీర్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 
డ్రోన్ల సాయంతో ఆయుధాల సరఫరా..
పోలీసులు తొలుత పుల్వామాకు చెందిన ముంతజీర్‌ మంజూర్‌ను అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి సరఫరాకు ఉద్దేశించిన ట్రక్కునూ సీజ్‌ చేశారు. అనంతరం మరో ముగ్గురిని పట్టుకున్నారు.  వారిలో ఒకరైన, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇజహార్‌ఖాన్‌ను విచారించగా.. పాకిస్థాన్‌లోని జైష్‌ కమాండర్‌ తమను పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో డ్రోన్ల సాయంతో జారవిడిచిన ఆయుధాలను సేకరించాలని ఆదేశించినట్లు చెప్పాడు.  పానిపత్‌ ఆయిల్‌ రిఫైనరీ వద్ద రెక్కీ నిర్వహించాలని చెప్పగా, తాను దానికి సంబంధించిన వీడియోలూ పంపినట్లు తెలిపాడు. అతని తర్వాతి లక్ష్యం అయోధ్య అని పోలీసులు వెల్లడించారు. ద్విచక్ర వాహనంలో పేలుడు పదార్థాలు అమర్చి, జమ్మూలో విధ్వంసానికి తెగబడాలని ఆదేశాలు వచ్చినట్లు మరో ఉగ్రవాది, షోపియాన్‌కు చెందిన తౌసిఫ్‌ అహ్మద్ చెప్పాడు. పోలీసులు సదరు బండిని స్వాధీనం చేసుకున్నారు. మరొక ఉగ్రవాది.. పుల్వామాకు చెందిన పండ్ల వ్యాపారి జహంగీర్‌ అహ్మద్‌ జైషే మహ్మద్‌లో నియామకాలు చేపడుతుంటాడని పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని