Mamata Banerjee: పోటీ అక్కడి నుంచే..!

రెండు పర్యాయాలు గెలిచిన భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేసేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది.

Updated : 21 May 2021 16:08 IST

రాజీనామా చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే

కోల్‌కతా: పశ్చిమ్‌బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌ స్థానం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో దీదీ మళ్లీ ఎక్కడి నుంచి పోటీకి దిగుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇదివరకు రెండు పర్యాయాలు గెలిచిన భవానీపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.  ఇందుకోసం తృణమూల్‌ సీనియర్‌ నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ రాజీనామా రాశారు. స్పీకర్‌కు రాజీనామా పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు.

బెంగాల్‌లో 292 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 213 సీట్లలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. కానీ, నందిగ్రామ్‌ నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన ప్రత్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ మమతా బెనర్జీనే తృణమూల్‌ నేతలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంతో మూడోసారి ముఖ్యమంత్రిగా దీదీ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆరు నెలల్లోగా ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి మమతా బెనర్జీ గెలుపొందాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇప్పటికే రెండుసార్లు ఎన్నికైన భవానీపూర్‌ నుంచే మళ్లీ పోటీ చేసేందుకు దీదీ సిద్ధమయ్యారు. దీనికోసం ఆ స్థానం నుంచి గెలుపొందిన సీనియర్‌ నాయకుడు సోభాందేవ్‌ ఛటోపాధ్యాయ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 

అక్కడి నుంచే ఎందుకు..?

గతంలో కాంగ్రెస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న భవానీపూర్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత అక్కడి రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గడిచిన మూడు పర్యాయాలుగా అక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ గెలుస్తూ వస్తోంది. భవానీపూర్‌ నుంచి మమత రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తొలిసారి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో అక్కడి ప్రజలు ఘన విజయం కట్టబెట్టారు. 2016లో మాత్రం ఆ మెజార్టీ 25 వేలకు పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో భాజపా ఓట్లు మెరుగుపడ్డాయి. అయితే, తాజాగా జరిగిన ఈసారి ఎన్నికల్లో తృణమూల్‌ అభ్యర్థి ఛటోపాధ్యాయ 28వేల మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో భవానీపూర్‌ ప్రజలు తృణమూల్‌ వైపే ఉన్నారన్న ధీమాతో మమతా బెనర్జీ తిరిగి అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని