2-డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి 

కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌ కోసం డీఆర్‌డీవో నుంచి తమకు అనుమతి లభించినట్టు .......

Published : 08 Jul 2021 19:03 IST

దిల్లీ: కరోనా చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధం ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. ఈ ఔషధం తయారీ, మార్కెటింగ్‌ కోసం డీఆర్‌డీవో నుంచి తమకు అనుమతి లభించినట్టు మ్యాన్‌కైండ్‌ ఫార్మా వెల్లడించింది. గ్వాలియర్‌లోని డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీఆర్‌డీఈ) ఈ ఔషధాన్ని తయారు చేయగా.. డీఆర్‌డీవోకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ల్యాబోరేటరీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీలలో క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయని మ్యాన్‌కైండ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ డ్రగ్‌ను విశాఖపట్నం, హిమాచల్‌ప్రదేశ్‌లలోని తమ యూనిట్లలో ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది.  మధ్యస్థ నుంచి తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించినట్టు మ్యాన్‌కైండ్‌ ఫార్మా తెలిపింది. ఆస్పత్రిపాలైన కరోనా రోగులు త్వరగా కోలుకొనేందుకు దోహదం చేయడంతో పాటు ఆక్సిజన్‌పై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుందని తేలినట్టు ప్రకటనలో పేర్కొంది. దేశంలో కరోనా బారినపడిన రోగులకు విస్తృతంగా ఈ ఔషధాన్ని చేరవేయాలన్న లక్ష్యంతోనే ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. 

2-డీజీ ఔషధానికి మనదేశంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే డీఆర్‌డీఓ భాగస్వామ్యంతో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఈ ఔషధాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది. ఈ మందు లభ్యత ఇంకా పరిమితంగానే ఉండటంతో దాన్ని పెంచేందుకు ఇతర కంపెనీలను సైతం ప్రోత్సహించాలని డీఆర్‌డీఓ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల శిల్పా మెడికేర్‌కు ఉత్పత్తి చేసేందుకు అనుమతించిన డీఆర్‌డీవో.. తాజాగా మ్యాన్‌కైండ్‌ ఫార్మాకు కూడా అనుమతి మంజూరు చేయడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని