
Mann Ki baat: విక్టరీ పంచ్‌తో ఒలింపిక్స్‌లో విజయాన్ని కాంక్షిద్దాం!
ఒలింపిక్స్.. అమృత్ మహోత్సవ్.. మన్ కీ బాత్ ముఖ్యాంశాలు
దిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మన్ కీ బాత్‌ని ఆరంభించారు. త్రివర్ణ పతాకాన్ని చేతబూని ప్రారంభోత్సవాల్లో భారత్ బృందం చేసిన మార్చింగ్ యావత్తు దేశాన్ని పులకరింపజేసిందన్నారు. ఒలింపిక్స్‌లో ఆడుతున్న ప్రతిఒక్కరూ విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ప్రారంభమైన ‘హమారా విక్టరీ పంచ్’ ద్వారా ప్రతిఒక్కరూ ఆటగాళ్లకు అండగా నిలవాలని కోరారు.
మన్ కీ బాత్‌లోని మరిన్ని ముఖ్యాంశాలు..
★ జులై 26 కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకొని.. నాటి సైనికధీరుల త్యాగాలను మోదీ గుర్తుచేశారు. భారత సైనిక దళాల ధీరత్వాన్ని, సంయమనాన్ని యావత్ ప్రపంచం కార్గిల్ యుద్ధం సమయంలో వీక్షించిందన్నారు.
★ భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి వచ్చే ఆగస్టు 15 నాటికి 74 సంవత్సరాలు నిండి 75వ వసంతం రాబోతోంది. ఈ సందర్భంగా మార్చి 12న గాంధీ సబర్మతీ ఆశ్రమం నుంచి ‘అమృత్ మహోత్సవ్’ ప్రారంభించిన విషయాన్ని మోదీ గుర్తుచేశారు. గాంధీజీ దండియాత్రను పునరుద్ధరించిన రోజు కూడా అదే అని తెలిపారు. నాటి నుంచి దేశవ్యాప్తంగా అమృత్ మహోత్సవ్ జరుగుతోందన్నారు.
★ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అనేక మంది సాతంత్ర్య సమరయోధుల గురించి చర్చించుకుంటున్నామన్నారు. మణిపూర్‌లోని మోయిరంగ్ అనే చిన్న పట్టణం సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్‌ఏ)కి ప్రధాన స్థావరంగా ఉండేదని తెలిపారు. అక్కడ ఐఎన్‌ఏకు చెందిన కర్నల్ షౌకత్ మాలిక్ స్వాతంత్ర్యానికి పూర్వం 14 ఏప్రిల్ 1944న తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14ని మోయిరంగ్ డేని జరుపుకొంటున్నామని వెల్లడించారు. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గత ఏప్రిల్ 14న కూడా మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశామని పేర్కొన్నారు.
★ ఆగస్టు 15న జాతీయ గీతాన్ని ఆలపించి రికార్డు చేయాలని దాన్ని రాష్ట్రగాన్.ఇన్‌కు అప్‌లోడ్ చేయాలని ప్రధాని కోరారు. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. వీలైనంత ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
★ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని.. చేనేత కార్మికుల కృషిని ప్రధాని ప్రశంసించారు. చేనేత వస్త్రాలు కొని ప్రతిఒక్కరూ వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
★ వైవిధ్యమైన సంస్కృతిగల భారత్‌లో ప్రతిఒక్కరూ కలిసి ఐకమత్యంగా ఉండాలని ప్రధాని కోరారు. ఈ మేరకు అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘నేషన్ ఫస్ట్.. ఆల్వేస్ ఫస్ట్’ అనే ప్రతిజ్ఞ తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మన్ కీ బాత్‌లో భాగంగా వివిధ రంగాల్లో పలువురు చేస్తున్న విశిష్ట సేవలను ప్రధాని ప్రశంసించారు. వెదర్‌మ్యాన్‌గా పేరొందిన సాయిప్రణీత్‌ను ఈ సందర్భంగా మోదీ ప్రత్యేకంగా అభినందించారు. తిరుపతికి చెందిన ఈయన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐరాస ప్రశంసలు అందుకున్నారు.
★ వానలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి
Advertisement