వాజేకి పీపీఈ కిట్‌వేసి సీన్‌ రీక్రియేషన్‌..!

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి బెదిరింపు లేఖ కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీంతో అధికారులు సీన్‌ రీక్రియేషన్‌కు  ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated : 17 Mar 2021 14:54 IST

* అంబానీకి బెదిరింపుల కేసులో వెలుగులోకి కొత్తవిషయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీకి బెదిరింపు కేసులో దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీంతో అధికారులు సీన్‌ రీక్రియేషన్‌కు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక బెదిరింపులకు ఉపయోగించిన స్కార్పియో వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ మృతి కేసులో అనుమానితుడైన అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే ఏకంగా బెంజ్‌ ఎస్‌యూవీని వినియోగిస్తున్నట్లు తేలింది. ఇప్పుడు ఆ ఎస్‌యూవీని జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకొంది. ఈ కారు మనీషా భవేశ్వర్‌ పేరుతో రిజిస్టరై ఉంది. అతను ఇదే కారులో కమిషనర్‌ కార్యాలయంలోని తన ఆఫీస్‌కు వస్తుండేవాడు.  పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో సోమవారం రాత్రి నుంచి ఎన్ఐఏ అధికారులు కొన్ని గంటలపాటు తనిఖీలు చేశారు. అక్కడ ఒక సీపీయూ, వాజే వినియోగించే ఐపాడ్‌, కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకొన్నారు. దీంతోపాటు వాజే వాడినట్లు చెబుతున్న బెంజ్‌ 4మాటిక్‌  కారు నుంచి రూ.5లక్షల నగదు, నగదు లెక్కించే యంత్రం, కొన్ని దుస్తులను  స్వాధీనం చేసుకొన్నట్లు ఎన్‌ఐఏ సీనియర్‌ అధికారి అనిల్‌ శుక్లా వెల్లడించారు. ఫిబ్రవరి 17వ తేదీన మన్‌సుఖ్‌ హిరేన్‌ కూడా ఈ బెంజికారును వినియోగించినట్లు థానేలోని ఓ భాజపా నాయకుడి ట్విటర్‌ ఖతాలో పోస్టు అయిన ఫొటోలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫొటో ఆధారంగా కాంగ్రెస్‌నేత సచిన్‌ సావంత్‌ కేసుతో భాజపాకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. 

డీవీఆర్‌లో వీడియో రికార్డుల గల్లంతు..!

సచిన్‌ వాజే తన గృహ సముదాయానికి ఉన్న సీసీ కెమేరాల డిజిటల్‌ వీడియో రికార్డర్లను తోటి అధికారులకు చెప్పి తెప్పించుకొన్నాడు. ఇప్పుడు సీఐయూ ఆఫీస్‌లో ఉన్న వాటిని ఎన్‌ఐఏ పరిశీలించింది. ఆ రికార్డుల నుంచి దృశ్యాలను తొలగించినట్లు గుర్తించింది. ఫిబ్రవరి 25న అంబానీ ఇంటిదగ్గర పేలుడు పదార్థాల వాహనం వెలుగులోకి వచ్చిన తర్వాత రెండు రోజులకే వాజే నివసించే రెసిడెన్షియల్ కాంప్లెక్‌కు క్రైమ్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ( వాజే నేతృత్వం వహిస్తున్న విభాగమే) పోలీస్‌ అధికారులు వెళ్లారు. వీరిలో అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ రియాజ్‌ ఖ్వాజీ కూడా ఉన్నాడు. అంబానీకి బెదిరింపుల కేసును దర్యాప్తు చేస్తున్నాం.. అందుకని ఈ గృహ సముదాయంలో ఉన్న రెండు డిజిటల్‌ వీడియో రికార్డ్లర్లను తమకు అప్పగించాలని ఖ్వాజీ ఓ చిత్తుకాగితంపై లేఖ రాసి  సెక్యూరిటీ సిబ్బంది, గృహసముదాయ సంఘ ఛైర్మన్‌కు ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి రెండు డీవీఆర్‌లు తీసుకొని వెళ్లిపోయారు. ఇప్పుడు వాటిల్లోని దృశ్యాలను తొలగించినట్లు గుర్తించారు.

పీపీఈ కిట్‌లో ఉన్నది వాజేనేనా..?

సచిన్‌ వాజేనే స్వయంగా స్కార్పియో కారును అంబానీ ఇంటి వద్ద వదిలేసి.. క్రిమినల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు చెందిన ఇన్నోవా వాహనంలో వెళ్లిపోయినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ శుక్రవారం కోర్టుకు తెలియజేసింది. తమ వద్ద ఉన్న ఓ ఫుటేజీలో పీపీఈ కిట్‌ ధరించి ఇన్నోవాలో నుంచి దిగి స్కార్పియో వైపు వెళుతున్న మనిషి వాజే అయ్యే అవకాశం ఉందని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దీంతో అతనికి పీపీఈ కిట్‌ వేసి సీన్‌ను రీక్రియేట్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని