Missing Arunachal boy: మిరామ్‌ తరోన్‌ను అప్పగిస్తామని చైనా చెప్పింది..!

దేశ సరిహద్దుల్లో ‘అదృశ్యమైన’ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యువకుడు మిరామ్‌ తరోన్‌ అప్పగింతపై చైనా సానుకూలంగా స్పందించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల

Published : 26 Jan 2022 15:44 IST

కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడి

దిల్లీ: దేశ సరిహద్దుల్లో ‘అదృశ్యమైన’ అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యువకుడు మిరామ్‌ తరోన్‌ అప్పగింతపై చైనా సానుకూలంగా స్పందించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా అతడి విడుదలలో జాప్యమవుతోందని తెలిపారు. త్వరలోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు మంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.

‘‘గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు భారత ఆర్మీ.. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ) సిబ్బందితో హాట్‌లైన్‌ ద్వారా మాట్లాడింది. అదృశ్యమైన యువకుడి అప్పగింతపై చైనా పీఎల్‌ఏ సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఓ ప్రదేశాన్ని కూడా సూచించింది. చైనా వైపు కఠిన వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. యువకుడి అప్పగింతపై త్వరలోనే వారు తేదీ, సమయం చెప్పే అవకాశముంది’’ అని రిజిజు ట్వీట్ చేశారు.

 మిరామ్‌ తరోన్‌ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చిన వెంటనే భారత ఆర్మీ.. హాట్‌లైన్‌ ద్వారా పీఎల్‌ఏతో సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర రక్షణశాఖ తెలిపిన విషయం తెలిసిందే. యువకుడి ఆచూకీ కనుగొని ప్రొటోకాల్స్‌ ప్రకారం అతడిని భారత్‌కు అప్పగించాలని కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు చైనా కూడా సానుకూలంగానే స్పందించి యువకుడి కోసం గాలింపు చేపట్టినట్లు కిరణ్‌ రిజిజు అంతకుముందు ట్వీట్ చేశారు. తమ భూభాగంలో ఓ బాలుడిని గుర్తించినట్లు చైనా బలగాలను జనవరి 20న భారత ఆర్మీకి సమాచారం ఇచ్చినట్ల రిజిజు తెలిపారు. అతడు అదృశ్యమైన యువకుడేనా అని నిర్ధారించుకొనేందుకు మరింత సమాచారం ఇవ్వాలని కోరగా.. మిరామ్‌ తరోన్‌ ఫొటోతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలను చైనాకు అందించినట్లు తెలిపారు. వాటిని పోల్చి ఆ యువకుడు మిరామ్‌ తరోన్‌ అని చైనా బలగాలు ధ్రువీకరించినట్లు ఆర్మీ వర్గాల సమాచారం. త్వరలోనే అతడిని భారత్‌కు అప్పగించేందుకు దౌత్యపరమైన ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. 

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అప్పర్‌ సియాంగ్‌ జిల్లా జిడో గ్రామానికి చెందిన మిరామ్‌ తరోన్‌ను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ బలగాలు అపహరించుకుని వెళ్లినట్లు ఎంపీ తాపిర్‌ గావ్‌ ఇటీవల ట్విటర్‌లో వెల్లడించారు.  సాంగ్‌పో నది (ఈ నదిని అస్సాంలో బ్రహ్మపుత్రగా పిలుస్తారు) అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశించే చోట ఈ ఘటన జరిగిందని చెప్పారు. మిరామ్‌తో పాటే ఉన్న అతడి స్నేహితుడు జానీ యాయింగ్‌ చైనా సైనికుల నుంచి తప్పించుకొన్నాడని ఎంపీ ట్విటర్లో పేర్కొన్నారు. అయితే, అరుణాచల్‌ ప్రదేశ్ ప్రభుత్వం, భారత ఆర్మీ వర్గాలు మాత్రం ఈ ఘటనను ‘అదృశ్యం’గా పేర్కొనడం గమనార్హం. వాస్తవాధీన రేఖ సరిహద్దుల్లో మూలికలు సేకరించడంతోపాటు వేటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని