
ఆరు నెలలుగా అతడి కడుపులో మొబైల్ ఉండిపోయింది!
కైరో: ఓ వ్యక్తి కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరగా.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడి కడుపులో ఆరు నెలలుగా మొబైల్ ఫోన్ ఉండటం గుర్తించి నివ్వెరపోయారు. వెంటనే శస్త్రచికిత్స చేసి మొబైల్‌ను బటయకు తీశారు. ఈ ఘటన ఈజిప్ట్‌లో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే..
దక్షిణ ఈజిప్ట్‌లోని ఆస్వాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆరు నెలల క్రితం పొరపాటున మొబైల్‌ను మింగేశాడట. అయితే, అది జీర్ణమై మలం ద్వారా బయటకొచ్చేస్తుందని భావించి.. వైద్యులను సంప్రదించలేదు. మొదట్లో ఇబ్బంది లేకున్నా.. తర్వాత అతడికి ఆహారం తీసుకోవడం కష్టమైందట. అయినా ఆహారం తక్కువ మొత్తంలో తీసుకుంటూ కాలం వెల్లదీశాడు. కాగా.. ఇటీవల అతడికి కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. కడుపులో మొబైల్‌ఫోన్‌ను గుర్తించారు. ఆ ఫోన్ చాలాకాలం లోపలే ఉండిపోవడంతో కడుపు.. పేగుల్లో గాయాలై, ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు తెలిపారు. వెంటనే శస్త్రచికిత్స చేసి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. తొందరగానే కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.